సైబర్‌క్రైమ్ నియంత్రణకు షార్ట్‌ఫిల్మ్స్
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:24 AM
సైబర్‌నేరగాళ్లు రోజుకో తరహా ఎత్తుగడతో అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు.
24 రకాలుగా జరుగుతున్న నేరాలపై చిత్రీకరణ
గంట నిడివితో థియేటర్లు, షాపింగ్‌మాల్స్, విద్యాసంస్థల్లో ప్రదర్శనకు సన్నాహాలు
దేశంలో మొదటిగా నగరంలో ఈ తరహా ప్రయోగం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
సైబర్‌నేరగాళ్లు రోజుకో తరహా ఎత్తుగడతో అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. సైబర్‌నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించేసరికి మరో విధంగా మోసాల పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో వాటి అడ్డుకట్టకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో సైబర్‌నేరాలు జరుగుతున్న తీరుతోపాటు జరగడానికి అవకాశం ఉన్న మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా షార్ట్‌ఫిల్మ్స్ తీసి ప్రదర్శించాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు.
నగరంలో సైబర్‌నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి కట్టడికి ప్రత్యేకంగా సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేసి, ఇద్దరు సీఐలను నియమించినా అడ్డుకట్టపడడం లేదు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుండడంతో ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సైబర్‌నేరగాళ్లకు అవకాశంగా మారింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఖాతా, డెబిట్‌కార్డు వివరాలు సేకరించడం, పోలీస్‌స్టేషన్ నుంచి, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని ‘మీపై కేసు నమోదైందని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ’ బెదిరించి ఖాతాలను లూటీ చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2023లో 409 కేసులు నమోదుకాగా పోలీసులు 70 మందిని అరెస్టు చేశారు. 2024లో 374 కేసులు నమోదవగా, 160 మందిని అరెస్టు చేశారు. 2025లో 286 కేసుల్లో 205 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సైబర్‌నేరాలు కట్టడికి కొత్తవ్యూహం అమలుచేయాలని సీపీ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు. ఇందులోభాగంగా ఇప్పటివరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన సైబర్‌నేరాల తీరుతెన్నులతో పాటు భవిష్యత్తులో సైబర్‌క్రైమ్ జరగడానికి అవకాశం ఉన్న మార్గాలను గుర్తించి, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు 28 రకాల సైబర్‌నేరాలపై షూటింగ్ పూర్తయింది. వీటన్నింటిని గంట నిడివి ఉండేలా ఎడిటింగ్ చేసి సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రదర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది అమలుజరిగితే దేశంలో ఈతరహా ప్రయోగం విశాఖలోనే ప్రథమమని సీపీ అభిప్రాయడ్డారు.
నగర పరిధిలో గత మూడేళ్లలో నమోదైన సైబర్ నేరాలు
సంవత్సరం కేసులు అరెస్టైన నిందితులు
2023 409 70
2024 374 160
2025 286 205
--------------------------------------