రోడ్లపైనే దుకాణాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:33 AM
నగరంలో రోడ్ల ఆక్రమణకు అడ్డుకట్టపడడం లేదు. ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్జిన్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేయడం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని గుర్తించిన జీవీఎంసీ, పోలీస్ అధికారులు కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఆక్రమణలు తొలగించారు.
సీతమ్మధారలో పెరిగిపోతున్న ఆక్రమణలు
కనిపించని ఫుట్‌పాత్‌లు
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
పట్టించుకోని జీవీఎంసీ, పోలీస్ అధికారులు
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రోడ్ల ఆక్రమణకు అడ్డుకట్టపడడం లేదు. ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్జిన్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేయడం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని గుర్తించిన జీవీఎంసీ, పోలీస్ అధికారులు కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఆక్రమణలు తొలగించారు. దీనివల్ల రోడ్లు విశాలంగా మారి, వాహనాల రాకపోకలు సవ్యంగా సాగాయి. కానీ, ఆ తరువాత రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మళ్లీ ఆక్రమణలు పెరిగిపోయాయి. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి. సత్యం జంక్షన్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఉన్న రోడ్డుతోపాటు ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న చర్చి నుంచి కేఆర్‌ఎం కాలనీకి వెళ్లే రోడ్డులో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా తోపుడుబండ్లు, బడ్డీలను ఏర్పాటుచేశారు. ఆయా దుకాణాలకు వచ్చేవారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కేఆర్‌ఎం కాలనీకి వెళ్లే మార్గంలో అయితే చర్చి ప్రహరీని ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై వరుసగా బడ్డీలు ఏర్పాటుచేయడంతోపాటు వ్యాపారులు రోడ్డుపైనే కుర్చీలు వేసుకుని వెల్డింగ్‌లు, కుర్చీల అల్లికలు, వాహనాల రిపేర్లు చేస్తున్నారు. దీనివల్ల ఆ రోడ్డులో వాహనాలు ఎదురెదురు వస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉండడం లేదు. ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు నడవడానికి కూడా వీల్లేకుండా పోతోంది. ఆ రోడ్డులో ఆక్రమణలను శాశ్వతంగా తొలగించాలని జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.