యథేచ్ఛగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:42 PM
మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు రహదారికి ఇరువైపులా యథేచ్ఛగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్న అధికారులు
మాంసాహార దుకాణాల వలన దుర్గంధం, కుక్కల బెడద
ఇబ్బంది పడుతున్న పాదచారులు, స్థానికులు
చింతపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు రహదారికి ఇరువైపులా యథేచ్ఛగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. మండల కేంద్రంలో మాంసాహారం, చేపల దుకాణాలు గతంలో కేవలం సంతబయలులో మాత్రమే ఉండేవి. కొంత కాలంగా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్ల ఈ దుకాణాలన్నీ రహదారికి ఇరువైపులా చేరాయి. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో దుర్గంధంతో పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కుక్కల బెడద పెరిగిపోయింది. ఆరు నెలల క్రితం ఓ గ్రామ సచివాలయం ఉద్యోగి నడిచి వెళుతుండగా మాంసాహార దుకాణాల వద్ధ సంచరిస్తున్న శునకాలు కరవడంతో ఆమె ర్యాబిస్ వ్యాధికి గురై మృతి చెందింది. ఈ సమస్యపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు ఆరు వారాల క్రితం రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేసిన మాంసాహార దుకాణాలను సంతబయలు తరలించారు. అయితే మండల పరిషత్, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో గత వారం నుంచి యథావిధిగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.