Share News

సెల్లార్లలో దుకాణాలు! రోడ్లపై వాహనాలు!!

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:55 AM

పార్కింగ్‌కు వినియోగించాల్సిన సెల్లార్లలో దుకాణాల ఏర్పాటు వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలమవుతోంది.

సెల్లార్లలో దుకాణాలు! రోడ్లపై వాహనాలు!!

నగరంలో ట్రాఫిక్‌ సమస్య జటిలం

కొన్నిచోట్ల దుకాణాల ముందు ఖాళీస్థలంలో కూడా వ్యాపారాలు

వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

చోద్యంచూస్తున్న జీవీఎంసీ అధికారులు

పోలీసులూ పట్టించుకోవడం లేదు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పార్కింగ్‌కు వినియోగించాల్సిన సెల్లార్లలో దుకాణాల ఏర్పాటు వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలమవుతోంది. వాణిజ్య ప్రాంతాల్లోని బహుళ అంతస్థుల భవనాల్లో సెల్లార్లను దుకాణాలకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో ఆయా భవనాల్లోని దుకాణాలు, కార్యాలయాలకు వచ్చేవారంతా తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో వాహనాల రాకపోలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

నగరంలో వాణిజ్య ప్రాంతాలైన పూర్ణామార్కెట్‌, జగదాంబ జంక్షన్‌, డాబాగార్డెన్స్‌, ద్వారకానగర్‌ వంటి చోట్ల దుకాణాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అద్దెలు భారీగా వస్తుండడంతో భవన యజమానులు నిబంధనలను ఉల్లంఘించి సెల్లార్లను అద్దెకు ఇస్తున్నారు. ఆయా భవనాల్లోని దుకాణాలు, కార్యాలయాలకు వచ్చేవారు తమ వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు స్థలం లేకపోవడంతో రోడ్డుపైన, ఫుట్‌పాత్‌లపైన పెడుతున్నారు. ఫుట్‌పాత్‌లు ఖాళీ లేకపోవడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. ఇరుకుగా ఉన్న రోడ్లపై రాకపోకలు సాగించే క్రమంలో వాహనచోదకులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్‌ చేయడం వల్ల ద్వారకానగర్‌, జగదాంబ జంక్షన్‌, పూర్ణామార్కెట్‌, డాబాగార్డెన్స్‌, దొండపర్తి జంక్షన్‌, రైల్వేన్యూకాలనీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ద్వారకా నగర్‌లోని బుదిల్‌ పార్క్‌ హోటల్‌ రోడ్డులో అయితే పరిస్థితి దారుణంగా ఉంటోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆ మార్గంలో గల పలు కాంప్లెక్స్‌ల్లో సెల్లార్లలో దుకాణాలను ఏర్పాటుచేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా రామాంజనేయులు ఉన్నప్పుడు ఆ మార్గంలో సెల్లార్ల ఆక్రమణలను పూర్తిగా తొలగించి, పార్కింగ్‌కు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత పట్టించుకునేవారు లేకపోవడంతో మళ్లీ యథావిధిగా సెల్లార్లలో దుకాణాలను నిర్మించి అద్దెకు ఇచ్చేశారు. ఆ మార్గంలో వాహనాలను రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ చేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ఆ మార్గం ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుందంటున్నారు. ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా గల పెట్రోల్‌ బంకు పక్కరోడ్డుతోపాటు ద్వారకా నగర్‌ ఆరు లైన్‌లలోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. ద్వారకా నగర్‌లోని రత్నా ప్లాజా వద్ద అయితే పార్కింగ్‌ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు భవనం ముందున్న ఖాళీ స్థలంలో ఏకంగా పార్లర్‌ను ఏర్పాటుచేసినా జీవీఎంసీ అధికారులు కన్నెత్తిచూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెల్లార్ల ఆక్రమణలపై చర్యలు శూన్యం

ట్రాఫిక్‌ సమస్యకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సెల్లార్లలో ఆక్రమణలను తొలగిస్తామంటూ జీవీఎంసీ, పోలీస్‌ శాఖ అధికారులు పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్లార్లను కచ్చితంగా పార్కింగ్‌కు వినియోగించాలని నిబంధనలు ఉన్నా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ చోద్యం చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం రోడ్డుపక్కన వాహనాలను నిలిపితే సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి జరిమానా విధిస్తున్నారు తప్పితే...అందుకు గల కారణంపై దృష్టిపెట్టడం లేదు. సెల్లార్‌లలో దుకాణాలను తొలగించి పార్కింగ్‌కు కేటాయించేలా చొరవ తీసుకోవడం లేదు. సెల్లార్‌లలో దుకాణాలు తొలగించి, వాహనాల పార్కింగ్‌కు కేటాయించినప్పుడే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది. ఆ దిశగా ఇప్పటికైనా పోలీస్‌, జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Sep 18 , 2026 | 12:55 AM