వృథాగా షాపింగ్ కాంప్లెక్స్‌లు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:46 AM
జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో స్థానిక సంస్థలకు అదనపు ఆదాయం కోసం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయాలను అధికారులు పట్టించుకోవడంలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్సులు ఆశించిన మేర ఆదాయం తీసుకురాకపోగా, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి.
బాగోగులు పట్టించుకోని పురపాలిక అధికారులు
అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఖాళీగా పలు దుకాణాలు
నిర్లక్ష్యంగా కొన్ని.. అధిక అద్దెలతో మరికొన్ని..
పేరుకుపోతున్న లీజుదారుల అద్దె బకాయిలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో స్థానిక సంస్థలకు అదనపు ఆదాయం కోసం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయాలను అధికారులు పట్టించుకోవడంలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్సులు ఆశించిన మేర ఆదాయం తీసుకురాకపోగా, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. వాణిజ్య సముదాయాల్లో కొన్ని దుకాణాలను అద్దెకు తీసుకున్న వారు అద్దెలు సరిగా చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. మిగిలిన దుకాణాలు నెలల తరబడి ఖాళీగా పడివుంటున్నాయి.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలో అధికారుల గణాంకాల ప్రకారం 14 వాణిజ్య సముదాయాలు, వాటిలో 160 దుకాణాలు ఉన్నాయి. 10 దుకాణాలు శిథిలావస్థలో ఉండగా, 49 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 101 షాపుల్లో లీజుదారులు వున్నారు. దుకాణాల అద్దెల ద్వారా జీవీఎంసీకి ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం రావాలి. కానీ రూ.కోటి మాత్రమే వస్తున్నది. చిన్న నాలుగు రోడ్ల జంక్షన్‌లో 25 దుకాణాలు ఉండగా వాటిలో 7 దుకాణాలను మాత్రమే అద్దెకు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు దుకాణాల అద్దె నెలకు రూ.15 వేల లోపు ఉండగా... జీవీఎంసీ అధికారులు మాత్రం రూ.25 వేలుగా నిర్ణయించారు. దీంతో ఈ దుకాణ సముదాయంలో షాపులను అద్దెకు తీసుకునేందుకు వ్యాపారాలు ముందుకు రావడం లేదు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో మూడు వాణిజ్య సముదాయాలు ఉండగా వాటిలో ఎనిమిది దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు షాపులు శిథిలావస్థకు చేరాయి. గవరపాలెం ఉన్నత పాఠశాల, రాజీవ్‌గాంధీ స్టేడియం, సతకంపట్టు, వేల్పులవీధి బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని వాణిజ్య సముదాయాల్లో కొన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. జార్జి క్లబ్‌కు సమీపంలో మునిసిపల్ పాఠశాలను ఆనుకొని ఉన్న దుకాణ సముదాయాన్ని రెండు దశాబ్దాల కిందట నిర్మించారు. ఇక్కడ మొత్తం 25 షాపులు వున్నాయి. వీటిలో చాలా వరకు షాపులను అద్దెకు ఇవ్వకుండా ఖాళీగా వుంచేశారు. మొదటి అంతస్థులో షాపుల నిర్మాణం శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఇదిలావుండగా అనకాపల్లిలోని దుకాణ సముదాయాల అద్దె బకాయిలు రూ.3 కోట్లకు పైగానే వున్నట్టు తెలిసింది. అద్దె చెల్లించని లీజుదారులను ఖాళీ చేయించకపోవడంతో ఒకరిని చూసి మరొకరు అద్దె చెల్లించడం మానేశారు. దీంతో జీవీఎంసీకి ‘వాణిజ్య’ ఆదాయం తగ్గిపోతున్నది.
నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద 18 దుకాణాల సముదాయం వుండేది. 2023లో వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో దుకాణాలను తొలగించింది. వాటి స్థానంలో కొత్తవి నిర్మించలేదు. దీంతో ప్రతి నెలా రావాల్సిన రూ.3 లక్షల ఆదాయాన్ని మునిసిపాలిటీ కోల్పోయింది. ఎలమంచిలి మునిసిపాలిటీలోని కొమ్మాయిగుండం చెరువు వద్ద నిర్మించిన వాణిజ్య సముదాయంలోని దుకాణాలు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రైవేటు దుకాణాల కంటే మునిసిపాలిటీ దుకాణాల అద్దె ఎక్కువ వుండడమే ఇందుకు కారణమని తెలిసింది.