Share News

వీధి దీపాల కాంట్రాక్టర్‌కు షాక్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:22 AM

నగరంలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు.

వీధి దీపాల కాంట్రాక్టర్‌కు షాక్‌

నిర్వహణలో బీఎన్‌ఆర్‌ సంస్థ విఫలం

కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని జీవీఎంసీ నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో మరొకరికి అప్పగించేందుకు రంగం సిద్ధం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు. వీధి దీపాల నిర్వహణలో విఫలమైన కాంట్రాక్టు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం కలిగిన సంస్థకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపించారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

జీవీఎంసీ పరిధిలో సుమారు 1.18 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు వీటి నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అనుబంధం కలిగిన ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) చూసేది. ఆ సంస్థకు జీవీఎంసీ ఏడాదికి రూ.18.5 కోట్లు చొప్పున చెల్లించేది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సంస్థ వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంది. దీంతో జీవీఎంసీ అధికారులు టెండర్లు ఆహ్వానించగా హైదరాబాద్‌కు చెందిన బీఎన్‌ఆర్‌ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఆ సంస్థకు జీవీఎంసీ ప్రతి నెలా రూ.కోటికిపైగా బిల్లు చెల్లిస్తోంది. వీధి దీపాల నిర్వహణ కోసం ఆ సంస్థ ప్రతి వార్డులో ఒక టెక్నీషియన్‌, ఒక హెల్పర్‌తోపాటు మరొకరితో బృందం ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీ పరిధిలో 98 బృందాలు వీధిదీపాలు ఎక్కడ వెలగడం లేదనేది గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా వెలగకపోతే రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి. అలాకానిపక్షంలో జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్‌కు జరిమానా విధిస్తారు. కానీ కాంట్రాక్టర్‌ తగినంతమంది సిబ్బందిని నియమించుకోకపోవడడంతో నగరంలో వీధి దీపాల నిర్వహణ గాడితప్పింది. వీధి దీపాలు వెలగకపోవడంతో వీధుల్లో అంధకారం రాజ్యమేలుతోంది. ఈ సమస్యను ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చామని, సమస్య పరిష్కారిస్తామంటూ అధికారులు కౌన్సిల్‌లోనే హామీ ఇచ్చారు. కానీ సమస్య నెరవేరలేదు. రాత్రివేళ వీధిలైట్లు వెలగకపోవడం వల్ల చోరీలు, ఇతర నేరాలు పెరుగుతున్నాయని పోలీసులు కూడా తరచూ చెబుతుండడంతో జీవీఎంసీ అధికారులే కాంట్రాక్టర్‌తో సంబంధం లేకుండా వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కాంట్రాక్టర్‌ను తొలగించి వేరొకరికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు ప్రతిపాదించారు. బీఎన్‌ఆర్‌ సంస్థకు టెండర్‌ గడువు ఉండడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేశారు. తర్వాత టెండరు రద్దు చేసుకుంటామని మరోమారు నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ప్రస్తుత కాంట్రాక్టర్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అనుబంధంగా ఉన్న ఈఈఎస్‌ఎల్‌ తిరిగి వీధి దీపాల నిర్వహణకు ఆసక్తి చూపుతుండడంతో ఆ సంస్థకు బాధ్యత అప్పగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ప్రస్తుత కాంట్రాక్టర్‌ను తొలగించి ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించినట్టు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Apr 17 , 2026 | 01:22 AM