Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:39 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. వాతావరణంలోని మార్పుల నేపథ్యంలో శీతల గాలులు, దట్టంగా పొగమంచు కొనసాగుతున్నది.

వణికిస్తున్న చలి
లంబసింగిలో చలిమంట కాగుతున్న స్థానికులు, పర్యాటకులు

దట్టంగా పొగమంచు

ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గని చలి తీవ్రత

పాడేరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. వాతావరణంలోని మార్పుల నేపథ్యంలో శీతల గాలులు, దట్టంగా పొగమంచు కొనసాగుతున్నది. ఏజెన్సీలో సోమవారం ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగానే కమ్మేసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ అదే వాతావరణం నెలకొంది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. చలికి ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతూ ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జి.మాడుగులలో 10.4 డిగ్రీలు

మన్యంలోని జి.మాడుగులలో సోమవారం 10.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, అరకులోయలో 10.5, ముంచంగిపుట్టులో 11.2, పాడేరులో 11.9, పెదబయలులో 12.5, చింతపల్లి, హుకుంపేటలో 12.9, కొయ్యూరులో 14.8, అనంతగిరిలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జి.మాడుగులలో..

జి.మాడుగుల: మండలంలో చలి తీవ్రత అధికంగా ఉంది. సోమవారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. చలి ఎక్కువగా ఉండడంతో ఉదయం వేళ వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు తెలిపారు.

లంబసింగిలో..

చింతపల్లి: మండలంలో చలి వణికిస్తోంది. సోమవారం ఉదయం, సాయంత్రం పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో కాఫీ తోటల్లో పండ్ల సేకరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా లంబసింగిలో చలి అధికంగా ఉంది. స్థానికులు ఉన్ని దుస్తులు ధరించి చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:39 AM