Share News

షైనింగ్‌ స్టార్స్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:11 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘షైనింగ్‌ స్టార్స్‌’ పురస్కారాలకు జిల్లా నుంచి ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు హెచ్‌ఈసీ గ్రూపు నుంచి, మరొకరు ఒకేషనల్‌ కోర్సులో ఎంపీహెచ్‌డబ్ల్యూకి చెందిన వారు. ఇద్దరూ దివ్యాంగుల కోటాలో ఎంపియ్యారు.

షైనింగ్‌ స్టార్స్‌

జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపిక

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బాలికలు

రాంబిల్లి/ రోలుగుంట, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘షైనింగ్‌ స్టార్స్‌’ పురస్కారాలకు జిల్లా నుంచి ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు హెచ్‌ఈసీ గ్రూపు నుంచి, మరొకరు ఒకేషనల్‌ కోర్సులో ఎంపీహెచ్‌డబ్ల్యూకి చెందిన వారు. ఇద్దరూ దివ్యాంగుల కోటాలో ఎంపియ్యారు.

రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన శానాపతి రమాశిల్ప ఇదే మండలం లాలంకోడూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2024-26లో హెచ్‌ఈసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ చదివారు. ఇటీవల విడదలైన ఫలితాల్లో ఆమె 723/1,000 మార్కులు సాధించింది. దీంతో దివ్యాంగుల కోటాలో ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.వి.ఎస్‌.నాయుడు మాట్లాడుతూ, ‘షైనింగ్‌ స్టార్‌’గా ఎంపికైన రమాశిల్ప తమ కళాశాలకే కాకుండా అనకాపల్లి జిల్లాకే గర్వకారణంగా నిలిచిందన్నారు. కృషి, పట్టుదల వుంటే చదువులో రాణించడానికి అంగవైకల్యం అడ్డుకాదని ఆమె నిరూపించిందని అన్నారు. రమాశిల్పను ఆయనతోపాటు అధ్యాపక బృందం, సహచర విద్యార్థులు అభినందించారు.

రోలుగుంట మండలంలోని కేజీబీవీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసిన చల్లా హేమ రాష్ట్రస్థాయి షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం కేజీబీవీ ప్రత్యేక అధికారి (ప్రిన్సిపాల్‌) తులసీ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేసి హేమను అభినందించారు. దివ్యాంగురాలైన ఆమె ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్‌)లో 857/1,000 మార్కులు సాధించారు. దీంతో రాష్ట్రస్థాయి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. త్వరలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వం వీరిని మెడల్‌, సర్టిఫికెట్‌తోపాటు రూ.20 వేల నగదు అందించి సత్కరించనున్నది.

Updated Date - Apr 25 , 2026 | 01:11 AM