పదిలో మెరిశారు
ABN , Publish Date - May 01 , 2026 | 02:18 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలతో సత్తా చాటారు.
పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
90.54 శాతం ఉత్తీర్ణత.. రాష్ట్రస్థాయిలో 6వ స్థానం
గత ఏడాదితోపోలిస్తే 1.5 శాతం అధికం
అమ్మాయిలదే పైచేయి
బాలురు 88.16 శాతం, బాలికలు 92.57 శాతం పాస్
97.3 శాతం ఉత్తీర్ణతతో వి.మాడుగుల మండలం టాప్
82.27 శాతంతో చివరి స్థానంలో మాకవరపాలెం
------
మొత్తం బాలురు బాలికలు
విద్యార్థులు 20,577 10,369 10,208
ఉత్తీర్ణులు 18,592 9,142 9,450
శాతం 90.54 88.16 92.57
---
అనకాపల్లి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలతో సత్తా చాటారు. పరీక్షలకు హాజరైన వారిలో 90.54 శాతం మంది ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రస్థాయిలో అనకాపల్లి జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లా నుంచి బాలురు 10,369 మంది, బాలికలు 10,208 మంది.. మొత్తం 20,577 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,142 మంది బాలురు, 9,450 మంది బాలికలు.. మొత్తం 18,592 మంది (90.54 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 89.04 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 1.5 శాతం పెరిగింది. వి.మాడుగుల మండలం 97.3 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. మాకవరపాలెం మండలం 82.27 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఎలమంచిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆడారి ప్రణతి 593/600 మార్కులు సాధించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవిని విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా కె.కోటపాడు మండలం చౌడువాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని టి.ఉష 592 మార్కులతో ద్వితీయ స్థానం, ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కనిగిరి హరిణి, అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాథపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రకృతి తారకేశ్ 591 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.
పెరుగుతున్న ఉత్తీర్ణత
ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు
97.75 శాతంతో ఏపీ మోడల్ స్కూల్స్ టాప్
32 ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత
ఇందులో 20 జడ్పీ ఉన్నత పాఠశాలలు..
అనకాపల్లి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతూ వస్తున్నది. విద్యా శాఖ అధికారులు ‘వంద రోజుల ప్రణాళిక’ను పక్కాగా అమలు చేయడం, ఉపాధ్యాయులు తమ శక్తి మేర కృషి చేయడం, విద్యార్థులు కష్టపడి చదవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 21,169 మంది హాజరు కాగా 18,848 మంది (89.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2024-25 విద్యా సంవత్సరంలో 20,774 మంది పరీక్షలకు హాజరు కాగా 18,293 మంది (88.44 శాతం) పాసయ్యారు. ఈ ఏడాది 20,577 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 18,592 మంది (90.54 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ఇక వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఏపీఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్ల నుంచి 136 మంది రాయగా 129 మంది (94.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కేజీబీవీల నుంచి 771 మంది పరీక్షలకు హాజరు కాగా 742 మంది (96.24 శాతం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ నుంచి 601 మంది పరీక్షలు రాయగా 556 మంది (92.51 శాతం) పాసయ్యారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నుంచి 206 మందికిగాను 195 మంది (94.66 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి 10,830 మంది పరీక్షలకు హాజరు కాగా 9,407 మంది (86.86 శాతం), మునిసిపల్ ఉన్నత పాఠశాలల నుంచి 450 పరీక్షలకు హాజరుకాగా 381 మంది (84.66 శాతం), ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి 444 మంది పరీక్షలకు హాజరు కాగా 434 మంది (97.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల నుంచి 135 మందికిగాను 119 మంది (88.15 శాతం), ప్రైవేటు పాఠశాలల నుంచి 6,126 మంది హాజరు కాగా 5,940 మంది (96.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రథమ శ్రేణిలో 15,957 మంది (85.83 శాతం), ద్వితీయ శ్రేణిలో 2001 మంది (10.76 శాతం), తృతీయ శ్రేణిలో 634 మంది (3.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
మొదటి స్థానంలో మాడుగుల, చివరి స్థానంలో మాకవరపాలెం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మాడుగుల మండలం 97.3 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 11 ప్రభుత్వం, మూడు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి 703 మంది పరీక్షలకు హాజరుకాగా 684 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర 96.79 శాతం, బాలికలు 97.78 మంది పాసయ్యారు. కింతలి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని చక్కా జెస్సీ 589 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. మాకవరంపాలెం మండలం నుంచి 406 మంది పరీక్షలకు హాజరు కాగా 334 మంది మాత్రమే (75 శాతం) ఉత్తీర్ణులై చివరిస్థానంలో నిలిచింది.
32 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
జిల్లాలో అన్ని రకాల యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 401 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 266, ప్రైవేటు పాఠశాలలు 135 ఉన్నాయి. పది ఫలితాల్లో 32 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 20 జడ్పీ ఉన్నత పాఠశాలలు, రెండు జ్యోతిరావుఫూలే బీసీ పాఠశాలలు, ఏడు కేజీబీవీలు, రెండు గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వున్నాయి.
25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్థుల కోసం మే 25వ తేదీ నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మే ఒకటో తేదీ నుంచి 9వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. కాగా గురువారం విడుదలైన ఫలితాలకు సంబంధించి రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం మే ఒకటో తేదీ నుంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.