జాడలేని షీ టీమ్స్
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:05 AM
నగరంలో ఆహార భద్రత కోసం జీవీఎంసీ ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (షీ) టీమ్స్ ప్రస్తుతం ఉనికిలో లేకుండాపోయాయి. ఈ టీమ్స్‌ను గత ఏడాది ఆగస్టులో ఏర్పాటుచేశారు. అప్పట్లో తనిఖీలతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. గతకొన్నాళ్లుగా తనిఖీలు ఆగిపోవడంతో ఆహార కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలు మళ్లీ పెరిగిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హోటళ్లలో ఆహార నాణ్యత తనిఖీల కోసం
గత ఆగస్టులో ఏర్పాటు
జీవీఎంసీ పరిధిలో 16 బృందాలు
మొదట్లో హడావిడి
ప్రస్తుతం ఆచూకీ లేని వైనం
నగరంలో పెరిగిపోతున్న కల్తీ ఆహార విక్రయాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ఆహార భద్రత కోసం జీవీఎంసీ ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (షీ) టీమ్స్ ప్రస్తుతం ఉనికిలో లేకుండాపోయాయి. ఈ టీమ్స్‌ను గత ఏడాది ఆగస్టులో ఏర్పాటుచేశారు. అప్పట్లో తనిఖీలతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. గతకొన్నాళ్లుగా తనిఖీలు ఆగిపోవడంతో ఆహార కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలు మళ్లీ పెరిగిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలోని పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కల్తీ, నిల్వ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. రుచి కోసం హానికరమైన రసాయనాలతో తయారుచేసి ముడిసరుకులను ఆహార తయారీలో వినియోగిస్తుండడంతో వినియోగదారులు ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆదాయమే పరమావధిగా భావించి ఆహార పదార్థాల తయారీలో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ హాటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో ఆహార తయారీ నాణ్యతను తనిఖీ చేసేందుకు 16 షీ టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. అందులో ఒక ఏఎంహెచ్‌ఓ, శానిటేషన్ సూపర్‌వైజర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, శానిటేషన్ వార్డు సెక్రటరీతోపాటు ఒక మహిళా పోలీస్‌ను నియమించారు. ఈ బృందాలు ప్రతిరోజూ కనీసం నాలుగు హోటళ్లు/ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు/బేకరీలను తనిఖీ చేయాలని నిబంధన విధించారు. ఆయా బృందాలు తనిఖీలకు వెళ్లినప్పుడు వంట గదిలో పరిశుభ్రత, ఆహార తయారీకి వాడే ముడిపదార్థాలను నిల్వచేసే పద్ధతి, ముడిసరుకుల నాణ్యత వంటి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఏదైనా ఉల్లంఘనలు గుర్తించినట్టయితే అక్కడికక్కడే నోటీసులు జారీచేసి, ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు జరిమానాలు విధించాల్సి ఉంటుంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 302 తనిఖీలు చేయగా 173 చోట్ల ఉల్లంఘనలు ఉన్నట్టు తేలడంతో నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. కొంతమందిపై కేసులు నమోదుచేశారు. వారి నుంచి సుమారు రూ.మూడు లక్షలు జరిమానా వసూలుచేశారు. షీ టీమ్స్ తనిఖీలతో వ్యాపారుల్లో కూడా భయం మొదలై, ఆహార పదార్థాల తయారీలో నాణ్యతకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. ప్రజల నుంచి కూడా సానుకూలస్పందన రావడంతో షీటీమ్స్ సంఖ్యను 32కి పెంచాలని కమిషనర్ నిర్ణయించారు.
కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో కనిపించని తనిఖీలు
ప్రారంభించిన మొదట్లో వరుస తనిఖీలు చేసిన షీ టీమ్స్ తర్వాత ఉనికిలో లేకుండాపోయాయి. గత కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో ఒక్క తనిఖీ కూడా చేసినట్టు సమాచారం లేదు. షీటీమ్స్ నిద్రావస్థలోకి వెళ్లిపోవడంతో ఆహార విక్రయదారులు తిరిగి తమ పాతపంథాలో నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ షీ టీమ్స్‌ను తిరిగి క్రియాశీలకం చేయడం ద్వారా ఆహార నాణ్యతను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.