Share News

సచివాలయ వ్యవస్థకు పదును!

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:54 PM

పౌర సేవలందించే గ్రామ సచివాలయ వ్యవస్థకు మరింత పదును పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేట్టింది. ఇప్పటికే సచివాలయం స్థాయిలో సిబ్బందిని క్రమబద్ధీకరించగా.. వాటిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది.

సచివాలయ వ్యవస్థకు పదును!
పాడేరులోని గ్రామ సచివాలయం- 1

క్షేత్ర స్థాయిలో వ్యవస్థ ప్రక్షాళన

పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల నియామకం

డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి అధికారి వ్యవస్థ ఏర్పాటు

‘స్వర్ణ గ్రామ సచివాయాలు’గా పేరు మార్పు

మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా కూటమి సర్కార్‌ ప్రత్యేక చర్యలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పౌర సేవలందించే గ్రామ సచివాలయ వ్యవస్థకు మరింత పదును పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేట్టింది. ఇప్పటికే సచివాలయం స్థాయిలో సిబ్బందిని క్రమబద్ధీకరించగా.. వాటిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. డివిజన్‌ స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై నిఘాకు డివిజనల్‌ అభివృద్ధి అధికారి వ్యవస్థను ఏర్పాటుచేసింది. దీంతో సచివాలయాలను డిప్యూటీ ఎంపీడీవోలు, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పర్యవేక్షించనున్నారు. ఈ చర్యలతో సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. సచివాలయ ఉద్యోగులకు సైతం ముఖ హాజరును తప్పనిసరి చేసింది. దీంతో ఉదయం 11 లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రతి సచివాలయ ఉద్యోగి విధిగా ముఖ హాజరు వేయాలనే నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు. గ్రామ సచివాలయాలకు ‘స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా మార్పునకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అందుకు ఇప్పటికే కేబినెట్‌ ఆమోదం తెలపగా గవర్నర్‌ అనుమతి సైతం పొందింది.

డిసెంబరు నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, డీడీవో వ్యవస్థ ఏర్పాటు

సచివాలయాలను మరింతగా పర్యవేక్షించాలనే ఆలోచనతో ప్రభుత్వం గతేడాది డిసెంబరులోనే డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. వారంతా మండల స్థాయి అధికారులుగా ఉంటూ వారి పరిధిలోని సచివాలయాలను పర్యవేక్షిస్తారు. అయితే ప్రస్తుతం మండల స్థాయిలో ఉన్న ఎంపీడీవోలకు పనిభారం కారణంగా సచివాలయాలను ఆశించిన స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడుతున్నది. దానిని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న వారి సర్వీసు ఆధారంగా డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించి మండలాలకు కేటాయించారు. ప్రస్తుతం వారంతా పంచాయతీరాజ్‌ శాఖలో ఉండడంతో డిప్యూటీ ఎంపీడీవోలుగా నియమిస్తూ గ్రామ/వార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. వారంతా డిసెంబరు ఒకటో తేదీ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలుగా బాధ్యతలు చేపట్టి సచివాలయాల పర్యవేక్షణపై దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోనూ డెవలప్‌మెంట్‌ అధికారిని నియమించింది. ఆ అధికారి డివిజన్‌ స్థాయిలో సచివాలయాలతో పాటు పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా అమలయ్యే పథకాలను పర్యవేక్షిస్తారు. ఆయా చర్యల కారణంగా ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

ఉమ్మడి అల్లూరి జిల్లాలో సచివాలయాల వివరాలు

  • 22 మండలాలు

  • 430 గ్రామ పంచాయతీలు

  • 352 గ్రామ సచివాలయాలు

  • సచివాలయాల్లో 2,150 మంది సిబ్బంది

  • 22 మంది డిప్యూటీ ఎంపీడీవోలు

  • 3 డివిజనల్‌ అభివృద్ధి అధికారులు

Updated Date - Jan 16 , 2026 | 10:54 PM