పంచుకున్నారు.. మింగేశారు
ABN , Publish Date - May 21 , 2026 | 11:59 PM
అనకాపల్లి మండల పరిధిలో జిల్లా ఖనిజ నిధుల (డీఎంఎఫ్)తో పంట కాలువల్లో చేపట్టిన పూడికతీత పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కూటమి నేతలు సాగునీటి సంఘాల పేరుతో నామినేషన్ విధానంలో తమ అనుచరులకు ఈ పనులు కట్టబెట్టినట్టు తెలిసింది. పనులు సరిగా చేయకుండా సగానికిపైగా నిధులు మింగేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంట కాలువల నిర్వహణ పనుల్లో అక్రమాలు
తూతూమంత్రంగా తుప్పలు తొలగింపు, పూడిక తీత
సాగునీటి సంఘాల మాటున నామినేషన్‌పై పనులు చేపట్టిన కూటమి నేతలు
రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోయిన అధికారులు
సగానికిపైగా నిధులు దుర్వినియోగం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి మండల పరిధిలో జిల్లా ఖనిజ నిధుల (డీఎంఎఫ్)తో పంట కాలువల్లో చేపట్టిన పూడికతీత పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కూటమి నేతలు సాగునీటి సంఘాల పేరుతో నామినేషన్ విధానంలో తమ అనుచరులకు ఈ పనులు కట్టబెట్టినట్టు తెలిసింది. పనులు సరిగా చేయకుండా సగానికిపైగా నిధులు మింగేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనకాపల్లి మండలం, పట్టణ పరిఽధిలోని పంట కాలువల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కాలువల్లో ఏటేటా పూడిక పెరిగిపోయి కొన్నిచోట్ల కాలువల ఆనవాళ్లు లేకుండాపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పంట కాలువలను అభివృద్ధి చేయించాలని భావించారు. గత ఏడాది కాలువల్లో తుప్పల తొలగింపు, పూడిక తీత పనులకు ఏ కాలువకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయించి, నిధుల మంజూరు కోసం కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో ఆమె ‘జిల్లా మినరల్ ఫండ్స్ (డీఎంఎఫ్) నుంచి రూ.137 కోట్లు మంజూరు చేశారు. పులి కాలువ, చెర్లోపల్లి కాలువ, ఎల్లయ్య కాలువ, వెదుళ్ల గెడ్డ, కొండుపాలెం, అగ్రహారం, తదితర మొత్తం 15 కాలువల్లో పూడిక తీత పనులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. ఒక్కో పనికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కేటాయించారు.
పులి కాలువలో తుప్పల తొలగింపు పనులకు రూ.5 లక్షలు, ఇదే కాలువలో శంకరం నుంచి భట్లపూడి వరకు పూడిక తొలగింపునకు రూ.9.5 లక్షలు, భట్లపూడి నుంచి కొప్పాక మెయిన్ రోడ్డు వరకు కాలువ పనులకు రూ.10 లక్షలు, కొప్పాక నుంచి అనకాపల్లి సౌత్ వరకు కాలువ పనులకు రూ.9.8 లక్షలు, అనకాపల్లి సౌత్ నుంచి ఆవఖండం వరకు కాలువ పనులకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. వెదుళ్లగెడ్డ నుంచి మార్టూరు మీదుగా సీహెచ్‌ఎన్ అగ్రహారం వరకు రూ.9.5 లక్షలు, రేబాక గ్రామానికి సమీపంలో వెదుళ్లగెడ్డ నుంచి అనకాపల్లి పులి కాలువ వరకు రూ.9.7 లక్షలు, శంకరం గ్రామానికి సమీపంలో వెదుళ్ల గెడ్డలో పూడిక తీత పనులకు రూ.10 లక్షలు, కొండుపాలెం పోతుగెడ్డలో పూడికతీత పనులకు రూ.9.2 లక్షలు కేటాయించారు. కొండుపాలెం గెడ్డ నుంచి ఆర్‌వీ గెడ్డ, సీహెచ్‌ఎన్ అగ్రహారం వరకు పూడికతీత పనులకు రూ.9 లక్షలు, కొప్పాకలో గరిమ్మగెడ్డ కాలువ నుంచి అనకాపల్లి వరకు పంట కాలువలో పూడిక తొలగింపునకు రూ.6 లక్షలు, చెర్లోపలి కాలువ నుంచి దిబ్బపాలెం వరకు పూడిక తొలగింపునకు రూ.9.95 లక్షలు, చెర్లోపలి పిల్ల కాలువలో పూడిక తీత కోసం రూ.9.9 లక్షలు, ఎల్లయ్య కాలువలో తుమ్మపాల నుంచి అనకాపల్లి వరకు పూడిక తొలగింపు కోసం రూ.9.95 లక్షలు, ఎల్లయ్య పిల్ల కాలువల్లో పూడిక తీత పనులకు రూ.10 లక్షలు కేటాయించారు.
నామినేషన్ కోసం పనుల విభజన
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.10 లక్షల అంచనాలు దాటిన పనులకు టెండర్లు పిలవాలి. కానీ అధికార పార్టీల నేతల ఒత్తిళ్లకుతోడు తమ స్వార్థంతో జలవనరుల శాఖ అధికారులు పలు పనులను ముక్క ముక్కలుగా విభజించారు. ఏ ఒక్క పనికూడా రూ.10 లక్షలకు మించకుండా అంచనాలను తయారు చేశారు. సాగునీటి సంఘాల పేరుతో నామినేషన్ విధానంలో కూటమి నేతలకు కట్టబెట్టారు. తుప్పల తొలగింపు, పూడిక తీత పనుల్లో నిబంధనలను పాటించలేదు. తూతూమంత్రంగా పనులు కానిచ్చేసి బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్నారు. కొండుపాలెం, శంకరం, భట్టపూడి, కొప్పాక పరిసరాల్లోని కాలువల్లో పూడిక తీత పనులకు ఎక్స్‌కవేటర్లను వినియోగించి లోతుగా తీయాలి. కానీ పైపైన పూడిక తీసి చేతులు దులుపుకున్నారు. భట్లపూడి చెరువు నుంచి కాలువకు నీరు ప్రవహించేందుకు మదుము నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. అనకాపల్లి పట్టణ పరిధిలో పులి కాలువ, చెర్లోపలి కాలువల్లో పూడికతీత పనులను జీవీఎంసీ అధికారులు మొక్కుబడిగా ముగించారు. కాలువ గట్లపై ఆక్రమణలున్న ప్రాంతాల్లో పూడిక తీత పనులు చేపట్టలేదు. మొత్తం మీద రూ.1.37 కోట్లలో సగానికిపైగా నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా మినరల్ ఫండ్స్‌తో సాగునీటి కాలువల్లో చేపట్టిన పనులపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి, నిధుల దుర్వినియోగానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.