శారదా నది కలుషితం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:40 AM
శారదా నది అనకాపల్లి పట్టణ పరిధిలో వ్యర్థాలతో కలుషితం అవుతున్నది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వినాయక నిమజ్జన ఘాట్, స్నానాల ఘాట్, వంతెన కింద వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి.
వ్యర్థాలు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన
పుణ్యస్నానాలకు భక్తులు వెనకడుగు
పట్టించుకోని జలవనరులు, జీవీఎంసీ అధికారులు
అనకాపల్లి టౌన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): శారదా నది అనకాపల్లి పట్టణ పరిధిలో వ్యర్థాలతో కలుషితం అవుతున్నది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వినాయక నిమజ్జన ఘాట్, స్నానాల ఘాట్, వంతెన కింద వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. పట్టణంలోని పలు వ్యాపార సంస్థల నిర్వాహకులతోపాటు పట్టణ ప్రజలు కూడా వ్యర్థాలను పాత వంతెన మీద నుంచి నదిలోకి వేస్తుండడంతో అవి కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు స్నానాలు చేయకుండానే వెనుతిరుగుతున్నారు. ఉమా రామ లింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు నదిలో స్నానాలు చేయడానికి సాహసించడం లేదు. నదిలో నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో వ్యర్థాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడమే కాకుండా కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నది. నదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి జల వనరుల శాఖ, కొత్తూరు పంచాయతీ, జీవీఎంసీ అనకాపల్లి జోనల్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.