విత్తుదామా.. వేచి చూద్దామా
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:45 AM
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి రెండు వారాలు దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు.
రుతుపనాలు వచ్చి పక్షం రోజూలైనా అరకొరగానే వర్షాలు
ఇప్పటికే మొదలైన ఎల్‌నినో ప్రభావం
ఖరీఫ్ సాగుపై సందిగ్ధంలో అన్నదాతలు
జలాశయాల్లో ఆశాజనకంగా లేని నీటినిల్వలు
భారీవర్షాలు కురిస్తే తప్ప.. ఆకుమడులపై వేచి చూసే ధోరణి
చోడవరం, జూన్29 (ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి రెండు వారాలు దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. మరోవైపు జూన్ నెల ముగుస్తున్నప్పటికీ వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. దీనికితోడు ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే మొదలైనట్టు వాతావరణ నిపుణులు చెబుతుండడంతో ఖరీఫ్‌లో పంటల సాగు చేపట్టాలా? వద్దా? అన్న సందిగ్ధంలో రైతులు వున్నారు. వర్షాధారంగా పంటలు సాగు చేసే ప్రాంతాల్లో ఎక్కడా విత్తనాలు చల్లిన దాఖలాలు లేవు. అదే విధంగా చెరువుల ఆయకట్టు కింద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మే, జూన్ నెలల్లో మెట్ట భూములను దుక్కి దున్నిన రైతులు, వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు చల్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గత పక్షం రోజుల్లో చెప్పుకోదగిన.. అంటే పొలాల గట్లు పొర్లేలా వర్షం కురవలేదు. చెదురుమదురుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో విత్తనాలు చల్లితే.. తరువాత వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏమిటి అన్నది అర్థం కావడంలేదు. ఒకటి, రెండు భారీ వర్షాలు పడితే తప్ప వ్యవసాయం పనులు ఊపందుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు చెబుతుండడం, అందుకు తగ్గట్టుగానే ఇంతవరకు సరైన వర్షాలు పడకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఖరీఫ్ సాగుపై రైతులు గుబులు చెందుతున్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో ఎక్కడా నీరు లేదు. మరోవైపు ఎండ తీవ్రతకు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. జిల్లాలో ఒక్క తాండవ జలాశయం మినహా మరే రిజర్వాయర్‌లో కూడా నీటి నిల్వలు ఇంతవరకు ఆశాజనకంగా లేవు. దీంతో వీటి పరిధిలోని రైతులు సైతం వరి ఆకుమడులు పోయడానికి ముందువెనుకా ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్‌లో జూలై రెండో వారం నుంచి వరినాట్లు ప్రారంభమై ఆగస్టు నెలాఖరునాటికి పూర్తిచేస్తుంటారు. ఈ ప్రకారం పలువురు రైతులు ఇప్పటికే వరి ఆకుమడులు పోసివుండాలి. కానీ ఈ ఏడాది అటువంటిదేమీ కనిపించడంలేదు.