Share News

రిస్టార్టుల్లో చీకటి దందాలు!

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:48 AM

నగర శివార్లలో ఎక్కడికక్కడ వెలుస్తున్న రిసార్టుల్లో అత్యధికం నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి.

రిస్టార్టుల్లో చీకటి దందాలు!

శివార్లలో ఎక్కడికక్కడ అనధికారికంగా నిర్వహణ

అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు

నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా

పేకాట డెన్‌లుగా కొన్ని...

పోలీసుల తనిఖీలు అంతంత మాత్రమే

గండిగుండం వ్యవహారంతో మరోమారు రిసార్ట్స్‌ బాగోతంపై చర్చ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర శివార్లలో ఎక్కడికక్కడ వెలుస్తున్న రిసార్టుల్లో అత్యధికం నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. కొన్ని రిసార్టుల నిర్వాహకులు తాము రూమ్‌లను గంటల లెక్కన అద్దెకు ఇస్తామని సోషల్‌ మీడియాలో నిర్భయంగా ప్రచారం చేసుకుంటున్నాయంటే ఏం జరుగుతున్నదో ఊహించుకోవచ్చు.

ఎక్కడైనా ఏదైనా దాడి, అత్యాచారం వంటి సంఘటనలు జరిగినప్పుడే రిసార్ట్స్‌ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. లేదంటే అన్నీ గుట్టుగానే సాగిపోతున్నాయి. మూడు నెలల క్రితం ఆరిలోవకు చెందిన ఒక యువతి పుట్టిన రోజు పార్టీకి వెళ్లి ఎండాడ రిసార్ట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనందపురం మండలం గండిగుండం రిసార్ట్‌ వ్యవహారం మరోసారి వాటి నిర్వహణ తీరును బయటపెట్టింది. అక్కడ కూడా పుట్టినరోజు వేడుకలోనే గొడవ జరిగింది. అసలు రిసార్టుల్లో మద్యం ఎలా అనుమతిస్తున్నారనేది ప్రశ్న. లక్షలాది రూపాయలు చెల్లిస్తే గానీ ప్రభుత్వం లైసెన్స్‌ ఇవ్వదు. అలాంటిది ఏ ఫీజులు చెల్లించకుండా వీరు మద్యం వ్యాపారం చేస్తుంటే ఎక్సైజ్‌ అధికారులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. పైగా అక్కడ పార్టీలో విదేశీ మద్యం గలగలా పారిందని చెబుతున్నారు. అది మరింత సీరియస్‌ కేసు. అయినా ఎక్సైజ్‌ అధికారులు నోరు విప్పడం లేదు.

కొందరు సాగర్‌నగర్‌, ఎండాడ, కాపులుప్పాడ, రుషికొండ, నేరెళ్లవలస, భీమిలి, ఆనందపురం, తదితర ప్రాంతాల్లో గెస్ట్‌హౌస్‌లు నిర్మించి, వాటిని రిసార్టులుగా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆనందపురం వైపు రాత్రిపూట బస చేసేంతగా పర్యాటకం అభివృద్ధి చెందలేదు. కానీ యువత పార్టీల కల్చర్‌కు అలవాటుపడి పుట్టినరోజులని, బ్యాచిలర్స్‌ పార్టీ అని అక్కడకు వెళుతున్నారు. రాత్రివేళ పెద్దగా సౌండ్‌ పెట్టి డీజేలు కూడా నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదులు చేస్తుంటే..అవి వారికి కాసులు కురిపించేవిగా మారిపోతున్నాయి. ఇటీవల కొన్ని రిసార్టులను గంటల చొప్పున అద్దెకు ఇస్తున్నారు. తమ దగ్గర గంటకు వేయి రూపాయలు మాత్రమే తీసుకుంటున్నామని, ఇంకే అదనపు వసూళ్లు ఉండవని, ఏసీ సౌకర్యం కూడా ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరికొందరు రిసార్ట్‌లను పేకాట డెన్‌లుగా మార్చేశారు. పోలీసులు నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కమిషనర్‌ కన్నెర్ర చేసినప్పుడో, సమీక్షకు వస్తున్నారని తెలిసినప్పుడో రికార్డుల్లో చూపించుకోవడానికి నాలుగైదు రిసార్ట్స్‌ను తనిఖీ చేస్తున్నారు.

చట్టం ఏమి చెబుతున్నదంటే....

- రిసార్ట్‌ నిర్వహించాలంటే అనేక ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా సర్టిఫికెట్లను అక్కడ ప్రదర్శించాలి. పన్నులు చెల్లించాలి.

- ముందుగా కార్పొరేషన్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి.

- ఆ భవనానికి అప్రూవుడ్‌ ప్లాన్‌ ముఖ్యం.

- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉండాలి.

- అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి.

- కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఆపరేషన్‌కు అవసరమైన అనుమతి తీసుకోవాలి.

- దుకాణాల చట్టం కింద లేబర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి.

- వృత్తిపన్ను, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి.

- ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అప్రూవల్‌ ఉండాలి.

- మద్యం విక్రయిస్తే బార్‌కి, పార్టీలకు అయితే ఆ రోజుకు ఎక్సైజ్‌ నుంచి పర్మిషన్‌ ఉండాలి.

- డీజే ప్లే చేస్తే మ్యూజిక్‌ కాపీ రైట్లు ఉండాలి.

వీటన్నింటితో పాటు రూమ్‌లు అద్దెకు తీసుకునే వారి ఆధార్‌ వివరాలు, ఫొటోలు తీసుకోవాలి. వాటితో రిజిస్టర్‌ నిర్వహించాలి.

- సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరి.

జిల్లాలో గల రిసార్ట్స్‌లో నాలుగైదింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు అంతా తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేనివాటిపై చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Aug 29 , 2026 | 12:48 AM