Share News

పెదమదినలో విషాద ఛాయలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:06 AM

మండలంలోని పెదమదిన గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు యువకుడు, బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెదమదినలో విషాద ఛాయలు
ఎర్రంశెట్టి కనకరాజు (ఫైల్‌ ఫొటో)

ఒకే రోజు యువకుడు, బాలిక ఆత్మహత్య

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదమదిన గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు యువకుడు, బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

మండలంలోని పెదమదిన గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి కనకరాజు(23) ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య ఎర్రంశెట్టి శ్రీను వద్ద ఉంటూ రాజాం మరిడిమాంబ దాబాలో వంట మనిషిగా పని చేస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి అనంతరం సమీపంలోని చింతచెట్టుకు ఉరివేసుకున్నాడు. అతని అన్నయ్య స్నేహితులు గమనించి అతనిని కిందకు దించి అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. అతని అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుచ్చెయ్యపేట ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మనస్తాపంతో బాలిక బలవన్మరణం

పెదమదిన గ్రామానికి చెందిన బాలిక (16) విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆ బాలికను తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లమని చెప్పగా నిరాకరించింది. ఈ విషయమై తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇది గమనించి ఆ బాలికను వెంటనే బుచ్చెయ్యపేట పీహెచ్‌సీకి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ సంఘటనపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Sep 18 , 2026 | 12:06 AM