అరకులోయలో విషాద ఛాయలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:25 PM
ఒడిశాలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
అరకులోయ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. అరకులోయకు చెందిన కొర్రా జేమ్స్(17), అరకులోయ శర్బగుడ కాలనీలో నివాసముంటున్న బూర్జకు చెందిన శామ్యూల్ సుధీర్(21), పానిరంగిని గ్రామానికి చెందిన గుజ్జెలి ప్రశాంత్(18) ఒకే బైక్‌పై మంగళవారం ఒడిశా వెళ్లారు. డియోమలి అనే ప్రాంతాన్ని సందర్శించి పెట్రోల్ కోసం సిమిలిగుడ వైపు వెళుతుండగా కుందిలి జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కొర్రా జేమ్స్, శామ్యూల్ సుధీర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రశాంత్ తీవ్రంగా గాయపడడంతో కోరాపుట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కి మంగళవారం రాత్రి తరలించారు. జేమ్స్, శామ్యూల్ మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంబులెన్స్‌లో అరకులోయకు తీసుకు వచ్చారు. మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు విలపించారు.