జంబువలసలో విషాద ఛాయలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:44 PM
హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులోని బూర్జ పంచాయతీ దండేసిగుడ (మల్లుంగుమ్మి) జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందడంతో వారి స్వగ్రామం జంబువలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దండేసిగుడ జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి
ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు
అనంతగిరి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులోని బూర్జ పంచాయతీ దండేసిగుడ (మల్లుంగుమ్మి) జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందడంతో వారి స్వగ్రామం జంబువలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ జలపాతం బాహ్య ప్రపంచానికి తెలియదు. ఇక్కడికి వెళ్లాలంటే కాలిబాట మాత్రమే ఉంది. సమీపంలో పంట పొలాలు ఉండడంతో గిరిజన రైతులు అటుగా వెళుతుంటారు. కాగా బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన సలేపు త్రిష అలియాస్ శిరీష (17), సలేపు రత్నకుమారి (16), సలేపు పవిత్ర (16), సలేపు అంజలి (18) నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ఈ జలపాతం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి వెళ్లారు. సెల్ఫీలు దిగడానికి రాయిపై ఎక్కి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి త్రిష, రత్నకుమారి, పవిత్ర మునిగిపోయి మృతి చెందగా, అంజలి ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందిన వెంటనే హుకుంపేట, అనంతగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుకుంపేట, అరకు సీఐలు సన్యాసినాయుడు, హిమగిరి, ఎస్‌ఐలు శంకరరావు, దుర్గాప్రసాద్‌లు మృతదేహాల తరలింపునకు చర్యలు చేపడుతూ, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో జంబువలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.