పన్నేడలో విషాదఛాయలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:27 PM
మండలంలోని సీకరి పంచాయతీ పన్నేడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం మత్స్యగెడ్డలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురు బాలల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు
పెదబయలు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సీకరి పంచాయతీ పన్నేడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆదివారం మత్స్యగెడ్డలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతులైన గల్లోంగి హర్షిత్ (10), కోడా ప్రదీప్ (10), పాంగి బబ్లు (8) కుటుంబాల్లో తరచూ ఇటువంటి విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హర్షిత్ తండ్రి గల్లొంగి మత్స్యరాజు జనవరి నెలలో మరణించారు. తల్లికి ఇటీవల ఆపరేషన్ అయ్యింది. అలాగే కోడా ప్రదీప్ తల్లి సీతమ్మ ఆరు మాసాల క్రితం మరణించింది. దీంతో ఐదుగురు పిల్లలను తండ్రి మాణిక్యం ఎంతో గారాబంగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో శోకంలో మునిగిపోయాడు. పాంగి బబ్లు తల్లి వరలక్ష్మి, ప్రదీప్ తండ్రి మాణిక్యం ఇద్దరు అన్నచెల్లెలు. పక్క పక్క ఇంట్లోనే ఉంటున్నారు. ఆ ఒక్క కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ మూడు కుటుంబాలు వ్యవసాయ, కూలీ కుటుంబాలు కావడంతో వరుస సంఘటనలను తట్టుకోలేకపోతున్నారు. ఈత సరదా మూడు ప్రాణాలను బలిగొనడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. వేసవి సెలవులకు వచ్చిన పిల్లలను విచ్చలవిడిగా విడిచిపెట్టకుండా వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.