Share News

సోలార్‌ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు చీకట్లు

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:33 AM

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా బీచ్‌రోడ్డులో అట్టహాసంగా ఏర్పాటుచేసిన స్మార్ట్‌ సోలార్‌ లైటింగ్‌ పోల్స్‌కు సాధారణ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం అందరినీ విస్మయపరుస్తోంది.

సోలార్‌ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు చీకట్లు

2018లో బీచ్‌రోడ్డులో రూ.13 కోట్లతో ఏర్పాటు

కోస్టల్‌ బ్యాటరీ నుంచి కురుపాం జంక్షన్‌ వరకు 580 సోలార్‌ పోల్స్‌ ఏర్పాటు

బ్యాటరీలు పాడైపోవడంతో వెలగని దీపాలు

సమస్య పరిష్కరించకుండా విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేసిన అధికారులు

పాదచారులకు తగిలేలా వేలాడుతున్న వైర్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా బీచ్‌రోడ్డులో అట్టహాసంగా ఏర్పాటుచేసిన స్మార్ట్‌ సోలార్‌ లైటింగ్‌ పోల్స్‌కు సాధారణ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం అందరినీ విస్మయపరుస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సుమారు రూ.13 కోట్లు వెచ్చించి బీచ్‌రోడ్డు వెంబడి సోలార్‌ పోల్స్‌ ఏర్పాటుచేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సోలార్‌తో పనిచేయని స్థితికి చేరుకున్నాయి. సమస్యను సరిదిద్దాల్సిన అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేశారు.

స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా రూ.13 కోట్లతో బీచ్‌రోడ్డులో కోస్టల్‌ బ్యాటరీ నుంచి కురుపాం సర్కిల్‌ వరకు ఇరువైపులా, సెంట్రల్‌ మీడియన్‌పై ఆరు మీటర్లు ఎత్తు ఉన్న సోలార్‌ పోల్స్‌ 380, నాలుగు మీటర్లు ఎత్తున్న సోలార్‌పోల్స్‌ 200 ఏర్పాటుచేశారు. నాలుగు వైపులా సోలార్‌ ప్యానల్స్‌ ఉండడం వల్ల పగటివేళ సూర్యరశ్మికి పోల్‌కు ఉన్న బ్యాటరీ చార్జి అయ్యి రాత్రి సమయంలో పోల్‌పై అమర్చిన లైట్లు వెలగాలి. దీనివల్ల ఏటా రూ.12 లక్షల వరకు విద్యుత్‌ చార్జీలు ఆదా అవడంతోపాటు ఏడాదికి 242 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గుతాయని అధికారులు అంచనా వేశారు. పోల్స్‌ ఏర్పాటుకి 2015లో ప్రతిపాదన రాగా 2017లో టెండర్లు పిలిచారు. 2018లో లైటింగ్‌ అందుబాటులోకి వచ్చింది. వీటి నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా ఈ ఏడాది ఏప్రిల్‌తో గడువు ముగియడంతో కాంట్రాక్టర్‌ తప్పుకున్నారు. తర్వాత వీటి నిర్వహణను గాలికి వదిలేయడంతో పోల్స్‌కు ఉన్న బ్యాటరీలు పాడైపోయాయి. దీంతో సోలార్‌ చార్జింగ్‌ జరగకపోవడంతో రాత్రిపూట లైట్లు వెలగడం లేదు. బ్యాటరీలు పాడైపోవడంతో కొత్తగా కొన్ని కొని అమర్చినప్పటికీ అవి కూడా పూర్తిగా పనిచేయడం లేదని ఎలక్ర్టికల్‌ విభాగం సిబ్బంది చెబుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం మానేసి ఏకంగా విద్యుత్‌ సరఫరా చేసి లైట్‌లను వెలిగించేస్తున్నారు. పోల్స్‌కు విద్యుత్‌ సరఫరా చేసే వైర్లు ఫుట్‌పాత్‌లపై వేలాడుతుండడంతో ఉదయం, రాత్రివేళ బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తున్నవారు ఎక్కడ షాక్‌ కొడతాయోనని భయపడుతున్నారు. దీనిపై ఎలక్ర్టికల్‌ విభాగం అధికారులను వివరణ కోరగా, సోలార్‌ పోల్స్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌ గడువు ముగియడంతో జీవీఎంసీయే చూస్తోందన్నారు. ఎనిమిదేళ్లు దాటడంతో బ్యాటరీలు పాడైపోయాయని, వాటిస్థానంలో కొత్తబ్యాటరీలు కొనుగోలు చేయాలనుకున్నా సరే మిగిలిన విడిభాగాలతో సెట్‌ కాకపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామన్నారు. ఈ విషయం కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:33 AM