ఐసీడీఎస్ భవనంపై నిర్లక్ష్యం నీడలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:20 PM
మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ భవనం ఏళ్ల తరబడి అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నది. భవన నిర్మాణానికి 95 శాతం నిధులను డ్రాచేసిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు కనీసం పట్టించుకోలేదు. దీంతో ఐసీడీఎస్ ప్రాజెక్టుకి సొంతగూడు కలగా మిగిలిపోయింది.
ఏళ్ల తరబడి అసంపూర్తిగా భవనం
నిధులు మింగేశారు.. నిర్మాణాలు వదిలేశారు
ఐదేళ్లు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
పాత రెవెన్యూ కార్యాలయం షెడ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
గూడెంకొత్తవీధి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):
జీకేవీధి ఐసీడీఎస్ ప్రాజెక్టును ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసింది. ఇందుకు కొత్త భవనం అందుబాటులో లేకపోవడంతో అప్పటిలో రెవెన్యూ కార్యాలయాల సముదాయంలో ఒక రేకుల షెడ్‌ని కేటాయించారు. ఐసీడీఎస్ అధికారులు భవనం పైకప్పు బాగు చేసుకుని కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. 2018లో జీకేవీధి ఐసీడీఎస్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.53లక్షలను మంజూరుచేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. టెండర్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ నూతన భవనం శ్లాబ్ వరకు నిర్మించాడు. మిగిలిన పనులను పూర్తి చేయలేదు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.53లక్షల్లో దాదాపు 95 శాతం నిధులను కాంట్రాక్టర్ డ్రా చేసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి నేటి వరకు భవన నిర్మాణ పనులను పూర్తి చేయలేదు.
కాంట్రాక్టర్‌కి వైసీపీ మద్దతు
ఐసీడీఎస్ కార్యాలయ నూతన భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసినప్పటికీ గత వైసీపీ పాలకులు కాంట్రాక్టర్‌కు మద్దతుగా నిలవడంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసింది. స్థానికులు, ఐసీడీఎస్ ఉద్యోగులు అసంపూర్తి భవనం పూర్తి చేయాలని గత ప్రభుత్వ పాలకులకు ఇచ్చిన అర్జీలన్నీ బుట్టదాఖలయ్యాయి. దీంతో జీకేవీధి ఐసీడీఎస్ ప్రాజెక్టుకి సొంత గూడు నేటికి అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్ భవనం చిన్నది కావడంతో ఐసీడీఎస్ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు పాఠశాలలు, కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..
గూడెంకొత్తవీధి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నూతన భవనాన్ని పూర్తి చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రంలో నాలుగేళ్లుగా అసంపూర్తి నిర్మాణాలతో ఈ భవనం దర్శనమిస్తున్నది. మండల కేంద్రాన్ని సందర్శిస్తున్న ఉన్నతాధికారులు అసంపూర్తి భవనాన్ని చూస్తూనే సందర్శనలు చేస్తున్నారే తప్ప ఏ ఒకరూ భవనం ఎందుకు అసంపూర్తిగా నిలిచిపోయింది అని ప్రశ్నించడం లేదు. ఇప్పటికైనా అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.