Share News

కరువు ఛాయలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:55 PM

మన్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అటకెక్కాయి. దీంతో వేసిన పంటలు నిలబెట్టుకునేందుకు గిరిజన రైతు కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఇళ్ల నుంచి బిందెలు, బకెట్లు, వాటర్‌ బాటిళ్లతో నీటిని తీసుకెళ్లి తడుపుకుంటున్నారు. చివరకు ఈ ఏడాది తిండి గింజలకైనా పండించుకోగలమా అని గిరి రైతులు మదన పడుతున్నారు.

కరువు ఛాయలు
హట్టగుడ గ్రామ సమీపంలో క్యాబేజీ, మిరప మొక్కలకు ఇంటి నుంచి తీసుకెళ్లి నీటిని పోస్తున్న యువతి

మన్యంలో అటకెక్కిన వర్షాలు

ఎండుతున్న పంటలు

చోడి పంటపై ఆశలు వదులుకున్న రైతులు

మిరప, కేబేజీ, టమాట మొక్కలకు

బిందెలతో నీరు తీసుకెళ్లి పోస్తున్న మహిళలు

అరకులోయ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు వేసవిలో కూడా ఇక్కడ వర్షాలు పడేవి. అటువంటిది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. దీంతో పొలాల్లో వేసిన మిరప, క్యాబేజీ, టమాటా, కాయగాయలను బతికించుకునేందుకు గిరి మహిళలు ఇళ్ల నుంచి నీటిని బిందెలతో మోసుకు వెళ్లి తడుపుతున్నారు. గన్నెల, హట్టగుడ, తదితర గ్రామాల్లో శనివారం సందర్శించిన ‘ఆంధ్రజ్యోతి’కి మిరప, టమాటా మొక్కలకు మహిళలు నీటి పోస్తున్న దృశ్యాలు కనిపించాయి. వాస్తవానికి ఏజెన్సీలో వేసవి కాలం అయినా విపరీతమైన వర్షాలు పడేవి. అటువంటి ఏజెన్సీలో జూన్‌, జూలై నెలలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో నీటి సమస్య ఎదురైంది. బోర్లు, చెక్‌డాంల కింద మాత్రమే వరి నాట్లు పడ్డాయి. చెక్‌డాంలోనూ నీరు అనుకున్నంత లేకపోవడంతో పొలం పనులు అరకొరగానే సాగుతున్నాయి. వర్షాలు పడకపోవడంతో నీటి సౌకర్యం లేక వరి నాట్లు చాలా వరకు వేయలేదు. మరి కొన్నిచోట్ల వేసిన నారుకు నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. ఈ ఏడాది తిండి గింజలైనా పండించగలమా అని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని లోతేరు, గన్నెల, చినలబుడు, ఇరగాయి పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో వేసిన చోడి పంట పోయినట్టేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి తడులు అందక చోడి మొక్కలు ఎండిపోయాయని రైతులు చెబుతున్నారు. గన్నెలలో వేసిన చోడి పంట మొలకెత్త లేదని, వర్షాభావ పరిస్థితితో పంట పోయిందని గ్రామానికి చెందిన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నాటిన మిరప మొక్కలు పెరుగుతున్నప్పటికీ వర్షం పడక తడులు లేకపోవడంతో ఊరు నుంచి బిందెలు, వాటర్‌బాటిళ్లతో నీటిని తీసుకెళ్లి ప్రతి మొక్క మొదల్లో తడుపుతున్నట్టు వృద్ధురాలు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పింది. అదేవిధంగా చినలబుడుకు చెందిన ఇద్దరు యువతులు క్యాబేజీ, మిరప మొక్కలకు ఇంటి నుంచి బక్కెట్లతో నీటిని తీసుకెళ్లి పోస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోస్తున్నామని వారు తెలిపారు. ఏజెన్సీలో వర్షాభావ ప్రభావం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదురవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:55 PM