Share News

నత్తనడకన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ పనులు

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:36 AM

స్థానిక మునిసిపాలిటీలో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నత్తనడకన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ పనులు

ఎలమంచిలిలో పది నెలల క్రితం శంకుస్థాపన

రూ.2.13 కోట్లతో నాలుగు యూనిట్లు

నెల క్రితం వరకు స్థల సమస్య

ప్రస్తుతం రెండు యూనిట్లకే పరిమితం

మిగిలిన యూనిట్లకు స్థలాన్వేషణ

ఎలమంచిలి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

స్థానిక మునిసిపాలిటీలో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పది నెలల క్రితం శంకుస్థాపన చేయగా, స్థల సమస్య కారణంగా నెల రోజుల క్రితం పనులు మొదలుపెట్టారు. మొత్తం నాలుగు యూనిట్లకు గాను ప్రస్తుతం రెండు యూనిట్లు మాత్రమే ఏర్పాటవుతున్నాయి. మిగిలిన రెండు యూనిట్లకు స్థలాన్ని అన్వేషిస్తున్నారు.

పట్టణంలో నివాసాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని గెడ్డలోకి విడుదల చేస్తున్నారు. దీనివల్ల దోమలబెడదతోపాటు పట్టణానికి ఆనుకొని వున్న పొలాల్లోకి మురుగునీరు చేరుతున్నది. ఈ సమస్యను నివారించడానికి స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్‌ (ఎస్‌ఏసీ) నిధులు రూ.2.13 కోట్లతో నాలుగుచోట్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పట్టణంలో శేషుకొండ సమీపంలో పెదపల్లి రోడ్డు పక్కన రూ.75 లక్షల వ్యయంతో 0.4 ఎంఎల్‌డీ సామర్థ్యంతో, తెరువుపల్లి వార్డులో రూ.93 లక్షలతో 0.5 ఎంఎల్‌డి సామర్థ్యంతో, కొత్తపాలెం వార్డులో రూ.20 లక్షలతో 0.109 ఎంఎల్‌డీ సామర్థ్యంతో, మంత్రిపాలెం, పెద్దగొల్లలపాలెం ప్రాంతంలో రూ.25 లక్షలతో 0.138 ఎంఎల్‌డీ సామర్థ్యంలో మురుగునీటి శుద్ధి యూనిట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. సుమారు పది నెలల క్రితం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అయితే స్థల సేకరణలో జాప్యం కారణంగా నెల క్రితం వరకు పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు శేషుకొండ, తెరువుపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో వుండడంతో మురుగునీటి శుద్ధి యూనిట్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. కాంక్రీట్‌ ప్లాట్‌ ఫారం పనులు పూర్తి చేశారు. శుద్ధి ప్లాంట్‌కు సంబంధించిన విడిభాగాలను రప్పించి, అమరుస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇక్కడ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మిగిలిన రెండుచోట్ల స్థలాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - Mar 03 , 2026 | 01:36 AM