తాగునీటికి అష్టకష్టాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:59 AM
నగరంలో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి.
నగరంలో గాడితప్పిన సరఫరా
ఏలేరు నుంచి తగ్గిన నీటి విడుదల
కొళాయిల నుంచి అరకొరగా పంపిణీ
కొన్నిచోట్ల రెండు, మూడు రోజులకు ఒకసారి
తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న నగరవాసులు
భూగర్భజలాలు అడుగంటి పడకేసిన బోర్లు
400 అడుగులు తవ్వినా కానరాని నీటి జాడ
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. కొళాయి నీరు రాకపోవడం, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కొనుగోలు చేసేందుకు ట్యాంకర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీటికోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. ఒకటి రెండురోజుల్లో నీటిసరఫరా గాడిన పడుతుందని అధికారులు సర్దిచెబుతున్నా ప్రజలకు భరోసా లభించడంలేదు
సుమారు 25 లక్షల జనాభా ఉన్న నగరంలోని ప్రజల తాగునీటికి అవసరాలకు ప్రతిరోజూ 90 మిలియన్‌గ్యాలన్లు (ఎంజీడీలు) నీరు అవసరం. పరిశ్రమలకు మరో 45 ఎంజీడీలు కావాల్సి ఉంది. మొత్తంగా రోజుకు 135 ఎంజీల నీరు సరఫరా చేయాలి. ఇందులో 105 ఎంజీడీల నీరు ఒక్క ఏలేరు రిజర్వాయర్ నుంచి కాలువద్వారా నగరానికి సరఫరా అవుతుండగా, మిగిలిన నీరు తాటిపూడి, రైవాడ, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ తదితర రిజర్వాయర్లతోపాటు గోస్తనీనదిలోని ఊటబావుల ద్వారా సరఫరా చేస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ వంటి రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోగా, భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి, బోర్లు ఒట్టిపోయాయి. దీనివల్ల ఏలేరు నుంచి వచ్చే నీరే నగరానికి ప్రధాన జీవనాధారంగా మారింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వచ్చే నీటిలో పరిశ్రమలకు కేటాయింపులను తగ్గించి, తాగునీటి అవసరాలకు ఇబ్బందిలేకుండా అధికారులు చర్యలు తీసుకునానరు. అయితే పోలవరం ఎడమకాలువ నీటిని నగరానికి తీసుకువచ్చే క్రమంలో అధికారులు ఏలేరు నుంచి నీటివిడుదల నిలిపివేశారు. పోలవరం కాలువ ద్వారా గోదావరి జలాలు అంతంతమాత్రంగానే కణితి బ్యాలెన్స్‌ంగ్ రిజర్వాయర్‌కు చేరుతుండడంతో నగరంలో నీటి సరఫరాపై ప్రభావం పడింది. 110 ఎంజీడీలు కేబీఆర్‌కు రావాల్సి ఉండగా 45 నుంచి 50 ఎంజీడీలకు మించడం లేదు. దీంతో నగర ప్రజల గొంతెండుతోంది. ఉన్నంతలో నీటిని అన్ని ప్రాంతాలకు సర్దుబాటు చేస్తుండడంతో కొన్నిప్రాంతాలకు రెండు,మూడు రోజులకు ఒకసారి కొళాయిలు వస్తున్నాయి. మరిన్నిప్రాంతాలకు రోజూ సరఫరా చేస్తున్నా పది నుంచి 15 నిమిషాలకు మించి రావడం లేదు. దీనికి తోడు బోరుబావులు వట్టిపోవడంతో అందరూ కొళాయినీటిపైనే ఆధారపడుతుండడంతో కొళాయినీటికి మరింత డిమాండ్ ఏర్పడింది. నీటి కోసం రోజంతా ఎదురుచూస్తున్న ప్రజలు కొళాయిలు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇంట్లో బోర్లు ఒట్టిపోవడం, కొళాయిలు రాకపోవడంతో తాగునీటితోపాటు రోజువారీ అవసరాలకు నీరు లేక అల్లాడిపోతున్నారు.
ట్యాంకర్లకూ డిమాండ్
కొళాయినీరు రాకపోవడం, బోర్లు ఒట్టిపోవడంతో రోజువారీ అవసరాలకు ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఏలేరు నుంచి నీటిసరఫరా తగ్గిపోవడంతో ట్యాంకర్లకు నీటి సరఫరా పడిపోయింది. గతంలో నగరంలో 11 ఫిల్లింగ్ పాయింట్‌ల ఉంచి రోజుకు 440 ట్రిప్పులు ట్యాంకర్ నీటిని సరఫరా చేసిన అధికారులు ఇప్పుడు వంద కూడా సరఫరా చేయలేకపోతున్నారు. జీవీఎంసీ ట్యాంకర్ల బుకింగ్ కోసం టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులోకి తెచ్చిన అధికారులు... ఎవరైనా ఫోన్‌చేసి ట్యాంకర్ కోసం అడిగితే ఏమని సమాధానం చెప్పాలో తెలియక స్పందించడం లేదు. దీంతో భీమిలి, ఆనందపురం తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు ట్యాంకర్లు నగరంలో నీటి అవసరాలకు సరఫరా చేస్తుండడంతో కొంత ఉపశమనం లభించేది.
శివారులోనూ ఎద్దడి
భూగర్భజలాలను విపరీతంగా తోడేస్తుండడంతో ఆయాప్రాంతాల్లో నీటిసమస్య తలెత్తడంతో రెవెన్యూశాఖ అధికారులు దాడులుచేసి అక్రమంగా ట్యాంకర్లకు నీటిని నింపుతున్న బోర్లని సీజ్‌చేసి, వాల్టాయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నగరవాసులకు ట్యాంకర్ల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో నీటి కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. తమకు ట్యాంకర్ల ద్వారానైనా నీటిసరఫరా చేయాలంటూ ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. కొద్దిరోజులు కిందట పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని పంప్‌హౌస్ వద్ద ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌చేస్తూ సిబ్బందిని చుట్టుముట్టారు. తాజాగా పీఎంపాలెంలోని ఎంవీవీ సిటీ నివాసితులు తమకు జీవీఎంసీ నీటిసరఫరా పైప్‌లైన్ వేయాలని, లేనిపక్షంలో ట్యాంకర్లతోనైనా నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌చేస్తూ ఎండాడ కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
సరఫరాలో లోపాలు లేకుండాచూడాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలన
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. బాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ట్యాంకర్లు, కొళాయిలకు నీటి సరఫరా వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర అవసరాలకు సరిపడా నీటి వనరులు అందుబాటులో ఉన్నందున నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
జీవీఎంసీ పరిధిలో 135 బల్క్‌వాటర్ కనెక్షన్లు, 8,100 పైగా సెమీబెల్క్ కనెక్షన్లకు ఎలివేట్ సర్వీస్ రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిసరఫరా చేస్తున్నామన్నారు. అపార్టుమెంట్‌లు, గేటెడ్‌కమ్యూనిటీలు బల్క్ లేదా సెమీబల్క్ కనెక్షన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎంవీవీ సిటీ నివాసిత సంఘం ప్రతినిధులు కమిషనర్‌ను కలిసి నీటి సమస్యను వివరించడంతో బల్క్‌కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నామని చెప్పడంతో నిర్దేశిత ఛార్జీలు చెల్లించిన అనంతరం మూడునెలల వ్యవధిలో కనెక్షన్ జారీ చేస్తామని, ప్రస్తుతం సమస్య అధికంగా ఉన్నందున వీలైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు.
20లోగా ఏలేరు కాలువ పూడికతీత పనులు పూర్తిచేయాలి
‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై సీఎంవో స్పందన
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దీనిపై ఆదివారం జీవీఎంసీ కమిషనర్‌తో మాట్లాడి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఏలేరు కాలువలో పూడికతీత పనులు ఈ నెల 20వ తేదీ నాటికే పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కాలువ ద్వారా గోదావరి నీటిని తీసుకొచ్చి, అవసరమైన మేరకు సరఫరా చేయాలని సూచించారు.