వాణిజ్య గ్యాస్‌కు తీవ్ర కొరత
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:05 AM
జిల్లాలో వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ల సరఫరా బాగా తగ్గిపోయింది. రోజులో సిలిండర్ అవసరమైన కొన్ని రెస్టారెంట్లకు.. బుక్ చేసిన వారం రోజుల తరువాతే సిలిండర్ డిలివరీ అవుతున్నది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు తయారు చేసే ఆహార పదార్థాల్లో కొన్నింటిని నిలుపుదల చేశారు. గ్యాస్‌తో అయితే ఐదు నిమిషాల్లో వండగలిగే ఆహార పదార్థాలను కట్టెల పొయ్యిపై వండడానికి 20 నిమిషాలు పడుతున్నదని, దీంతో కస్టమర్లు ఎక్కువసేపు వేచివుండలేక వెళ్లిపోతున్నారని పలు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. కట్టెల పొయ్యిలు సైతం ఏర్పాటు చేసుకునే వెసులుబాటులేని వారు తాత్కాలికంగా తమ వ్యాపారాలను మూసివేస్తున్నారు.
మెరుగు పడని సిలిండర్ల సరఫరా
కట్టె పొయ్యిలకు మళ్లుతున్న హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు
గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలోనూ జాప్యం
బుక్ చేసిన పది రోజుల తరువాతే డెలివరీ
అనకాపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ల సరఫరా బాగా తగ్గిపోయింది. రోజులో సిలిండర్ అవసరమైన కొన్ని రెస్టారెంట్లకు.. బుక్ చేసిన వారం రోజుల తరువాతే సిలిండర్ డిలివరీ అవుతున్నది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు తయారు చేసే ఆహార పదార్థాల్లో కొన్నింటిని నిలుపుదల చేశారు. గ్యాస్‌తో అయితే ఐదు నిమిషాల్లో వండగలిగే ఆహార పదార్థాలను కట్టెల పొయ్యిపై వండడానికి 20 నిమిషాలు పడుతున్నదని, దీంతో కస్టమర్లు ఎక్కువసేపు వేచివుండలేక వెళ్లిపోతున్నారని పలు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. కట్టెల పొయ్యిలు సైతం ఏర్పాటు చేసుకునే వెసులుబాటులేని వారు తాత్కాలికంగా తమ వ్యాపారాలను మూసివేస్తున్నారు.
కాగా గృహ వినియోగదారులకు సైతం గతంలో మాదిరిగా సత్వరమే సిలిండర్ డెలివరీ జరగడంలేదు. బుక్ చేసిన పది రోజుల తరువాత ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో విధంగా వున్నాయి. నిబంధనల ప్రకారం వంట గ్యాస్ బుకింగ్‌కు పట్టణాల్లో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు గడువు ఉంటుందని, ఈలోగా రీఫిల్ కోసం బుక్ చేసుకున్నా, గడువు దాటిన తరువాతే సిలిండరు డెలివరీ అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు వాస్తవం కాదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 45 రోజులు దాటిన తరువాతే రీఫిల్ బుక్ చేస్తున్నామని, అయినాసరే పది రోజుల తరువాత సిలిండర్ డెలివరీ అవుతున్నదని అంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు దూరంగా వున్న గ్రామాల గ్యాస్ వినియోగదారుల ఇక్కట్టు వర్ణానాతీతం. గతంలో వారానికి ఒక రోజు గ్రామాలకు వ్యాన్‌లో సిలిండర్లు తీసుకువచ్చి డెలివరీ చేసేవారని, పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తరువాత గ్రామాలకు సిలిండర్ల వ్యాన్ రావడం లేదని, దీంతో ఖాళీ సిలిండర్ తీసుకొని గ్యాస్ ఏజెన్సీ వద్దకు తామే వెళ్లాల్సి వస్తున్నదని, అయినాసరే అప్పటికప్పుడు సిలిండర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.