Share News

తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:42 AM

ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతులు వరి బదులు తక్కువ నీరు అవసరం అయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మండలంలోని పులపర్తి గ్రామంలో పంటలను పరిశీలించారు.

తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు
పులపర్తిలో పొలాలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి

వర్షాధార భూముల్లో వరి సాగు చేయొద్దు

చిరుధాన్యాలు, పప్పుదినుసులు వంటి ప్రత్యామ్నాయ పంటలు మేలు

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాదేవి

ఎలమంచిలి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతులు వరి బదులు తక్కువ నీరు అవసరం అయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మండలంలోని పులపర్తి గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆశాదేవి మాట్లాడుతూ, ఈ ఏడాది జూన్‌ నుంచి ఇంతవరకు జిల్లాలో సాధారణ వర్షపాతంలో 50 శాతంకన్నా తక్కువ నమోదు కావడం ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిందన్నారు. వరిసాగుకు అధిక మొత్తంలో నీరు అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు చోడి, గంటి, జొన్న, ఉలవ, జనుము వంటి తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటలను సాగుచేసుకోవాలని రైతులను కోరారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, రాయితీలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలన్నారు. రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల కింద వరి సాగు చేసే రైతులు ఈ నెలాఖరులోగా ఫసల్‌ బీమా యోజన కింద ఇన్స్యూరెన్స్‌ చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ అవసరాల మేరకు యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను రైతులకు అందుబాటులో వుంచినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాదేవి తెలిపారు. ఆమె వెంట ఎలమంచిలి ఏఓ మోహనరావు, వ్యవసాయ సహయకులు, రైతులు వున్నారు.

పొడి వాతావరణంతో పంటలకు చీడపీడలు

నివారణ చర్యలు చేపట్టాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ సూచన

అనకాపల్లి అగ్రికల్చర్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పొడి వాతావరణంతోపాటు తగిన వర్షపాతం లేని కారణంగా ఎద వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, కూరగాయ పంటలకు పలు రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయని, రైతులు వెంటనే వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఏడీఆర్‌ డాక్టర్‌ సిహెచ్‌.ముకుందరావు సూచించారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వాతావరణ ఆధారిత వ్యవసాయంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎద వరిలో పొడతెగులు, వంగలో వెర్రి తెగులు, మిరప పంటపై తామర పురుగు, చెరకు, వేరుశనగ పంటలను రసం పీల్చు పురుగులు ఆశిస్తున్నాయని అన్నారు.

వరిలో పొడ తెగులు నివారణకు హెక్సాకొనజోల్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. నీటి సదుపాయం వున్న భూముల్లో వరినాట్లు వేసేటప్పుడు నారు ఆకు చివర్లను తుంచి, 20్ఠ15 సెంటీమీటర్ల దూరంలో కుదురుకు 2 లేదా 3 మొక్కల చొప్పున నాటుకోవాలన్నారు. చదరపు మీటరుకు 33 మూనలు ఉండేలా చూసుకోవాలని, నాటిన తర్వాత ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పుతో బాటలు తియ్యడంవల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడ పీడల ఉధృతిని కొంతవరకు అదుపు చేయవచ్చునని పేర్కొన్నారు. వరి విత్తనాలను నేరుగా విత్తే పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుందని, అందువల్ల కలుపు నివారణకు 25-30 రోజుల వయసుగల పైరులో లీటరు నీటికి 2.4డి అమైన్‌ సాల్టు 58ు ఇ.సి 2 మిల్లీ లీటర్లు, 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలనిఇ చెప్పారు. లేదంటే అల్మిక్స్‌ అనే కలుపు మందును ఎకరాకు ఎనిమిది గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

వేరుశనగలో రసం పీల్చు పురుగుల నివారణకు డైమిథోయేట్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని ముకుందరావు తెలిపారు. వంగ మొక్కలను వెర్రి తెగులు ఆశించినట్టయితే తెగులు ఆశించిన మొక్కలను పీకివేసి, డైమిథోయేట్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని కోరారు. మిరప పంటను తామర పురుగు ఆశించడంవల్ల ఆకులు ముడుచుకుపోతాయని, ఈ పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తెల్లనల్లి ఆశించినట్టయితే డైమిథోయేట్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు వి.గౌరి, ఎ.అలివేణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:42 AM