Share News

తీవ్ర దుర్భిక్షం

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:23 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌...మూడు నెలల కాలంలో జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది.

తీవ్ర దుర్భిక్షం

జిల్లాలో 58.8 శాతం లోటు వర్షపాతం నమోదు

మూడు నెలల్లో 426.7 మి.మీ.కుగాను 175.7 మి.మీ.నమోదు

విశాఖ రూరల్‌లో 69.9 శాతం తక్కువ

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండిపోయిన రిజర్వాయర్లు

విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):

నైరుతి రుతుపవనాల సీజన్‌...మూడు నెలల కాలంలో జిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు మూడు నెలల్లో 426.7 మి.మీ.కుగాను కేవలం 175.7 మి.మీ. (సాధారణం కంటే 58.8 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌ మండలంలో 383.7 మి.మీ.కి కేవలం 115.6 (సాధారణం కంటే 69.9 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. గత ఏడాది ఇదే సమయంలో 426.7కి 467.6 .మి.మీ. (9.7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. అటువంటిది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచి జిల్లాలో వర్షాభావం కొనసాగుతుంది. జిల్లాలో నాలుగు మండలాల్లో వ్యవసాయం భూములు ఉన్నాయి. అర్బన్‌ పరిధిలో గల ఏడు మండలాల్లో 25 లక్షల మంది జనాభా నివాసం ఉంటున్నారు. పంటలు ఎంత ముఖ్యమో నగరంలో ప్రజలకు తాగునీరు కూడా అంతే ప్రధానం. వర్షాలు లేకపోవడంతో నగరం, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, వాగులు ఎండిపోయాయి. మేహాద్రిగెడ్డ, గంభీరం, ముడసర్లోవ రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. చాలా ప్రాంతాల్లో బోర్ల నుంచి నీరు రావడం లేదు. సెప్టెంబరు నెలలో కూడా వర్షాలు కష్టమేనని వాతావరణ శాఖ చెబుతుంది. అదే జరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతుంది.

మండలం జూన్‌-ఆగస్టు కురిసిన

కురవాల్సిన వర్షపాతం వర్షపాతం

పెందుర్తి 403.1 157

ఆనందపురం 429.1 212.2

పద్మనాభం 591.0 287.9

భీమునిపట్నం 429.3 152.9

విశాఖపట్నం రూరల్‌ 383.7 115.6

పెదగంట్యాడ 407.8 147.2

గాజువాక 365.4 133.6

సీతమ్మధార 433.9 167.9

మహారాణిపేట 433.9 230.8

గోపాలపట్నం 403.1 182.1

ములగాడ 407.8 145.1

Updated Date - Sep 01 , 2026 | 01:23 AM