Share News

ఏడు కిలోమీటర్లు డోలీమోత

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:54 AM

మండలంలోని పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏడు కిలోమీటర్లు డోలీమోత
డోలీలో గిరిజనుడిని తరలిస్తున్న దృశ్యం

అనారోగ్యంతో ఉన్న గిరిజనుడిని ఆస్పత్రికి తరలింపు

అనంతగిరి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన పెండెల రామన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో పినకోట పీహెచ్‌సీకి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి చింతలపాలెం నుంచి కొండిబకోట మీదుగా రేగులపాలెం వరకు ఏడు కిలోమీటర్లు రామన్నను మోసుకు వెళ్లారు. కొండిబకోట వద్ద ఉధృతంగా పారుతున్న గెడ్డను దాటి రేగులపాలెం వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో పినకోట పీహెచ్‌సీకి తరలించారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 03 , 2026 | 12:54 AM