బీచ్‌రోడ్డులో సేవా సంకల్ప్ అభియాన్
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:59 AM
ప్రజా సేవలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు
బీచ్ రోడ్డు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సేవలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖాకృతులతో తీరంలో నిర్మించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది. ర్యాలీలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు ఎండీ షరీఫ్ మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. బలహీన వర్గాలకు కేంద ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల జీవనోపాధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా డబుల్ ఇంజన్ సర్కారు సాధించి న విజయాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజ ల్లో అవగాహన కల్పించడం, పారిశుధ్యం మెరుగుపరచడం, మొక్కలు నాటడం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కాళికామాత ఆలయం నుంచి వైఎంసీఏ కూడలి వరకు నేతలు, నగరవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, పరశురామ్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవా ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నొడగల కృష్ణ, భీమిలి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.