Share News

నేటి నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:20 AM

వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్య సాధనలో భాగంగా స్వర్ణాంధ్ర-2047సాధనకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నేటి నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’
సేవా సంకల్ప్‌ అభియాన్‌ పోస్టర్లు

నెల రోజులు వివిధ కార్యక్రమాల నిర్వహణ

జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వికసిత్‌ భారత్‌- 2047, స్వర్ణాంధ్ర- 2027 లక్ష్యంగా చర్యలు

పాడేరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్య సాధనలో భాగంగా స్వర్ణాంధ్ర-2047సాధనకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర సర్కారు ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్యంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వాటిపై లబ్ధిదారులైన ప్రజల్లో సైతం అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అందుకు గాను ప్రతి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిల్లో సేవా సేతు శిబిరాలను నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువస్తారు. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారి విజయగాఽథలు వీడియోల రూపంలో మరికొంత మంది ప్రజలకు తెలియజేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న విద్య, వైద్యం, అంగన్‌వాడీ సేవలు, డిజిటల్‌ అక్షరాస్యత, యువతకు ఉపాధి, స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లను మరింత మందిని తయారు చేయడం. వారి స్ఫూర్తితో మరి కొంతమంది యువత ముందుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ’సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగం. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు నెల రోజులు ఆయా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:20 AM