Share News

దైవదర్శనానికి బయలుదేరి తిరిగిరాని లోకాలకు..

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:47 AM

దైవదర్శనానికి భర్తతో కలిసి బయలుదేరిన ఆమె దారిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

దైవదర్శనానికి బయలుదేరి తిరిగిరాని లోకాలకు..

భర్త కళ్లెదుటే భార్య మృతి

దిచక్రవాహనంపై అన్నవరం బయలుదేరిన పెందుర్తి దంపతులు

దారిలో న్యాయంపూడి వద్ద వెనుక నుంచి ఢీకొన్న వ్యాన్‌

తీవ్రగాయాలతో భార్య మృతి

నక్కపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

దైవదర్శనానికి భర్తతో కలిసి బయలుదేరిన ఆమె దారిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వ్యాన్‌ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కళ్ల ముందరే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త షాక్‌కు గురయ్యాడు. నక్కపల్లి మండలం న్యాయంపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

విశాఖ నగరంలోని పెందుర్తికి చెందిన ఓలుపల్లి ఈశ్వరరావు, భార్య గాయత్రి (26)తో కలిసి అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు సోమవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరు నక్కపల్లి మండలం న్యాయంపూడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఐషర్‌ వ్యాన్‌ బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనానికి ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని సైతం ఢీకొన్నది. దీంతో రెండు లారీల మధ్య నలిగిపోయిన గాయత్రి.. తీవ్రంగా గాయపడి చివరకు ఐసర్‌ వ్యాన్‌ ఇంజన్‌పై పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. భర్త ఈశ్వరరావు గాయాలతో బయటపడ్డారు. కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో షాక్‌కుగురైన ఈశ్వరరావు కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహానికి స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళీ చెప్పారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె వున్నట్టు బంధువులు చెప్పారు.

Updated Date - Jun 30 , 2026 | 01:47 AM