మొన్న మౌనిక...నిన్న జెస్సీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:13 AM
మృగాళ్లను నమ్మి అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటే అదంతా ప్రేమే అనుకొని మరో ఆలోచన లేకుండా వెళ్లి విగతజీవులుగా మారుతున్నారు.
రోజుల వ్యవధిలో ఇద్దరు యువతుల మృతి
ప్రేమగా పిలిచి ప్రాణాలు తీస్తున్నారు
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
మృగాళ్లను నమ్మి అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటే అదంతా ప్రేమే అనుకొని మరో ఆలోచన లేకుండా వెళ్లి విగతజీవులుగా మారుతున్నారు. మొన్నటికి మొన్న మౌనికను ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్లి నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. తాజాగా ఇంట్లో పార్టీకని చెప్పి వెళ్లిన జోడుగుళ్లపాలేనికి చెందిన శాంతికుమారి (జెస్సీ) మృతిచెందింది. ఈ రెండు కేసుల్లోను పోలీసులు వ్యవహరించిన తీరు నగర ప్రజలకు అనేక అనుమానాలు కలిగించింది. మౌనిక విషయంలో రవీంద్ర చెప్పిందే ప్రామాణికంగా తీసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు జెస్సీ విషయంలోను నిందితులు చెప్పిన మాటలనే పోలీసులు విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయని, చేతులపై కోతలు ఉన్నాయని, మెడ నులిమేశారని జెస్సీ సోదరి, నర్స్‌గా పనిచేస్తున్న ఆమె స్నేహితురాలు దీనిని హత్యగా ఆరోపిస్తుంటే...పోలీసులు ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు యువకులు, ఒక యువతిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిందితుల పేర్లు మాత్రమే వెల్లడించారు. అటువంటి వారి బారిన మరింతమంది పడకుండా ఉండడానికైనా వారెవరో చెప్పాల్సింది.
కేసులో అనుమానాలు అనేకం
బృందంలో ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి శారీరక సంబంధం ఉందని శాంతికుమారి ప్రచారం చేస్తున్నందున ఆమెను కొట్టారని అంటున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకేదో జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.