ప్రజల ముంగిటకే సేవలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:11 AM
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా ‘సర్వీస్ మేళా’ పేరుతో జీవీఎంసీ ద్వారా అందే సేవలన్నింటినీ ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.
ఒకేచోట బర్త్ సర్టిఫికెట్, డోర్ నంబర్ సవరణ, ఆస్తి పన్ను పేరు మార్పు వంటి సేవలు
వచ్చే నెల 26 నుంచి వార్డుల్లో ‘సర్వీస్‌మేళా’లు
ఎక్కడపడితే అక్కడ డెబ్రిస్ వేస్తే రూ.25 వేలు జరిమానా
ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రోడ్లు
జూన్ 15 నాటికి సిద్ధం
గ్రీనరీ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సొంతంగా నర్సరీ ఏర్పాటు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా ‘సర్వీస్ మేళా’ పేరుతో జీవీఎంసీ ద్వారా అందే సేవలన్నింటినీ ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. ఆయన గురువారం జీవీఎంసీ ప్రఽధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో బర్త్ సర్టిఫికెట్లు, డోర్ నంబర్‌లో సవరణలు, ఆస్తి పన్ను పేరు మార్పులు, ఇంటి పన్నుకు సంబంధించిన అభ్యంతరాలు, పారిశుధ్యపరమైన సమస్యలు, యూజీడీ కనెక్షన్లు, కొళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందేందుకు ప్రజలు జీవీఎంసీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగుతున్నారన్నారు. అన్ని విభాగాల అధికారులు ఒకేచోట కూర్చుని ఆయా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా వార్డుల వారీగా మేళాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 26 నుంచి ఈ మేళాలను ప్రారంభిస్తామన్నారు.
నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేస్తుండడంతో పారిశుధ్య సమస్య త లెత్తుతున్నందున 15 ప్రాంతాలను డెబ్రిస్ డంపింగ్‌కు ఎంపిక చేశామన్నారు. అక్కడి నుంచి కాపులుప్పాడలోని సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటుకు తరలిస్తామన్నారు. ఎంపికచేసిన ప్రాంతాల్లో కాకుండా మరెక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలను వేసినట్టయితే రూ.25 వేలు జరిమానా విధిస్తామన్నారు. దీనికోసం జోన్ వారీగా ఒక బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు వార్డు సచివాలయ సిబ్బందితో బృందాలను ఏర్పాటుచేశామన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో రెండు రోడ్ల నిర్మాణం జరుగుతోందని, వేపగుంట-పినగాడి రోడ్డును జూన్ 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేపగుంట-జుత్తాడ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు ఎదురైనందున జూన్ 30వ తేదీ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మురికివాడ రహిత నగరంగా విశాఖను తయారుచేసేందుకు యాక్షన్‌ప్లాన్ తయారుచేశామన్నారు. జీవీఎంసీ పరిధిలో 66 మురికివాడలు ఉండగా, అందులో మొదటగా వెలంపేట, ఇందిరానగర్ మురికివాడలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచామన్నారు.
నగరంలో పారిశుధ్యం పెంచేందుకు 574 మంది అదనపు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతోపాటు చెత్త సేకరణకు 50 ఈ-ఆటోలను సమకూర్చుకుంటామన్నారు. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా రూ.25 కోట్లతో సమ్మర్ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఎక్కడైనా నీటిసమస్య ఉంటే తక్షణం సంప్రతించేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
నగరంలో పచ్చదనం పెంచేందుకు వీలుగా జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. పచ్చదనం పెంపు, నిర్వహణ కోసం చీఫ్ ఇంజనీర్‌తోపాటు ఇద్దరు ఎస్‌ఈలు ఇటీవల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి అధ్యయనం చేశారన్నారు. అక్కడ మాదిరిగా జీవీఎంసీకి సొంతంగా నర్సరీ ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించడంతో ముడసర్లోవ వద్ద నాలుగైదు ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయబోతున్నామన్నారు. ఏఈ, హార్టికల్చర్ అధికారి ఆధ్వర్యంలో జోనల్ కమిటీలను నియమిస్తామన్నారు. ప్రత్యేకంగా పీఎల్‌సీ విభాగాన్ని ఏర్పాటుచేశామని, నగరంలో 75 స్ర్టెచ్‌లలో పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా పారిశుధ్య సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. క్యూలైన్ల నిర్వహణ బాధ్యతను ఈసారి జీవీఎంసీకి అప్పగించడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు జీవీఎంసీ ఆస్తులను బదలాయించడం లేదని, ఉన్న ఆస్తుల ద్వారా మరింత ఆదాయం ఎలా సాధించవచ్చుననే దానిపై ఒక నివేదిక ఇచ్చేందుకు కన్సల్టెంట్‌ను మాత్రమే స్మార్ట్‌సిటీ ద్వారా నియమించుకుంటున్నామన్నారు. కన్సల్టెంట్‌కు ఏడాదికి రూ.50 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని కూడా స్మార్ట్‌సిటీ నుంచి చెల్లిస్తారు కాబట్టి, జీవీఎంసీపై భారం ఉండదన్నారు. ఆస్తుల నిర్వహణ, హక్కులు జీవీఎంసీకే ఉంటాయని స్పష్టంచేశారు.
వార్డుల విభజన ప్రారంభం
జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రారంభించామన్నారు. భీమిలి వైపు నుంచి మొదలై పెందుర్తిలో ముగించనున్నట్టు కమిషనర్ చెప్పారు. ఈనెల 24వ తేదీ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధమవుతుందన్నారు. వార్డుల వారీగా ప్రదర్శిస్తామన్నారు. వాటిపై ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి వారం రోజుజు అవకాశం ఉందన్నారు. భీమిలి, పెందుర్తి మండలాల్లోని మిగిలిన పంచాయతీలతోపాటు ఆనందపురం, పద్మనాభం మండలాల విలీన ప్రతిపాదనను పరిశీలించాలని ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. దీనిపై పరిశీలన ఇప్పటికే పూర్తిచేశామన్నారు. ఆయా పంచాయతీల విలీనానికి జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్‌ఓసీ తమకు చేరితే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.