Share News

కేజీహెచ్‌లో సేవలు మెరుగుపడాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:19 AM

కేజీహెచ్‌ అందిస్తున్న సేవల్లో నాణ్యత పెంపు, ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల సమృద్ధి వినియోగంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ఏజెన్సీ ద్వారా సంబంధిత ప్రక్రియను రెండు వారాల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు.

కేజీహెచ్‌లో సేవలు మెరుగుపడాలి

నాణ్యత పెంపు, వసతుల వినియోగంపై అధ్యయనం

ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

రూ.43.7 కోట్లతో రూపొందించిన 14 ప్రాజెక్టులపై చర్చ

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌ అందిస్తున్న సేవల్లో నాణ్యత పెంపు, ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల సమృద్ధి వినియోగంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ఏజెన్సీ ద్వారా సంబంధిత ప్రక్రియను రెండు వారాల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ముందుగా అజెండా అంశాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణలు కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ క్యాజువాల్టీ ఒకవైపు, ఏఎంసీ మరోవైపు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రెండూ ఒకేవైపు ఉండేలా చూడాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కేజీహెచ్‌లోని అన్ని వార్డుల్లో గేట్‌ పాస్‌ల విధానాన్ని పునరుద్ధరించి సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు రాకుండా ఈ విధానం దోహదం చేస్తుందన్నారు. కేజీహెచ్‌లో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల వినియోగంపై కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలన్నారు. ఫైర్‌ సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. గైనకాలజీ విభాగం సేవల్లో నాణ్యత పెరగాలన్నారు. పెథాలజీ విభాగంలో పరీక్షలు చేసే స్లైడ్స్‌ నాణ్యత సరిగ్గా ఉండడం లేదని వైద్యులు తెలపగా..తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కేజీహెచ్‌ సేవలపై అందరిలోనూ సంతృప్తి ఉందని, ఇంకా మెరుపడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. రూ.43.7 కోట్లతో రూపొందించిన 14 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను సమావేశంలో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కమిటీ ముందుంచారు. వాటిలో యూజీడీ నెట్‌వర్క్‌, రూఫ్‌టాప్‌ షెడ్స్‌, ఆర్థో ఐసీయూ, ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం, హెల్త్‌ కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, లిఫ్టుల ఏర్పాటు, ఆధునిక పరికరాల కొనుగోలు, అంతర్గత రోడ్లు, కొత్త ఓపీ బ్లాక్‌ నిర్మాణం, రవాణా, విద్యుద్ధీకరణ, ఫైర్‌ సేఫ్టీ, అదనపు మహాప్రస్థానం వాహనాలు వంటి అంశాలు ఉన్నాయి. వీటిపై కమిటీ చర్చించింది. కార్యక్రమంలో ఎన్‌టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, హెచ్‌డీఎస్‌ నూతన కమిటీ సభ్యులు బాలసతీష్‌, మర్రివేముల శ్రీనివాస్‌, ఉసిరికాయల యజ్ఞశ్రీ, వేణుగోపాల్‌, పల్లా రాధాలక్ష్మి, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి, జీవీఎంసీ ఏడీసీ నల్లనయ్య, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయ్‌ భాస్కర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు, ఇతర, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 01:19 AM