Share News

వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై సీరియస్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:32 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్రమాలకు పాల్పడిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది.

వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై సీరియస్‌
పాడేరులో జూన్‌ 22న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌పై విచారణకు హాజరైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు(ఫైల్‌)

- డీఎంహెచ్‌వో డి.కృష్ణమూర్తి నాయక్‌ సస్పెన్షన్‌

- జీవో జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌

- అక్రమాలు నిర్ధారణ కావడంతో ఎట్టకేలకు శాఖాపరమైన చర్యలు

పాడేరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్రమాలకు పాల్పడిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి బాధితుల కథనం, విచారణాధికారుల నివేదికల ఆధారంగా వివరాలిలా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని వైద్యులు మొదలుకుని పారా మెడికల్‌ సిబ్బంది వరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వైద్యుల రెగ్యులరైజేషన్‌, ఇతర సిబ్బంది సర్వీసు అంశాల క్రమబద్ధీకరణ, డిప్యూటేషన్లు, కాంట్రాక్ట్‌ సిబ్బంది వార్షిక రెన్యువల్స్‌ వంటి ప్రక్రియలను చేపట్టేందుకు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధిత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఫిర్యాదులు చేశారు. అలాగే ఆస్పత్రులకు వచ్చే ప్రత్యేక అభివృద్ధి నిఽధులు, పల్స్‌ పోలియో వంటి జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రుల్లోని వ్యర్థాలను సేకరించే సంస్థల పేరిట అధిక మొత్తంలో నిధులు తప్పుడు బిల్లులతో స్వాహా చేశారని పలువురు ఉద్యోగులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అక్రమాలపై రెండు స్థాయిల్లో విచారణలు

స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అక్రమాలపై ఉన్నతాధికారులు మూడు స్థాయిల్లో విచారణలు చేపట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విశాఖపట్నంలోని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాధారాణి మే నెలలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్‌, బాధిత ఉద్యోగులు హాజరయ్యారు. అలాగే జూన్‌ 22, 23 తేదీల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ఎస్‌.అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా పని చేస్తున్న 353 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వార్షిక రెన్యువల్‌ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల సంఘం నేతలు బి.సందీప్‌కుమార్‌, ఎన్‌.పవన్‌కల్యాణ్‌, వాసు, వెంకట్‌, బాధిత ఉద్యోగులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ రెండు విచారణల నివేదికలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతికి సమర్పించారు. అలాగే ఆమె సైతం అంతర్గత విచారణ చేపట్టారు. అన్ని విచారణల్లో డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌ అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ జీవో ఆర్‌టీ నంబర్‌ 669ను మంగళవారం జారీ చేశారు. గతేడాది అక్టోబరులో ఇక్కడ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తి నాయక్‌ కేవలం ఎనిమిది నెలల్లోనే అక్రమాల ఆరోపణలతో సస్పెండ్‌ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 22 , 2026 | 12:32 AM