Share News

ఏయూలో కలకలం

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:06 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డితో పాటు మరో నలుగురిని అధికారులు సస్పెండ్‌ చేయడం క్యాంపస్‌లో కలకలం సృష్టించింది.

ఏయూలో కలకలం

మాజీ వీసీ ప్రసాదరెడ్డితోపాటు మరో నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఈసీ సమ్మతితో అధికారుల చర్యలు

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డితో పాటు మరో నలుగురిని అధికారులు సస్పెండ్‌ చేయడం క్యాంపస్‌లో కలకలం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన ప్రసాదరెడ్డి అనేక అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. సుమారు పది నెలలపాటు విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారించి నివేదిక సమర్పించారు. భారీగా నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్టు ధ్రువీకరించారు. ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా వర్సిటీ అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు తొలుత నూతనంగా ఏర్పాటైన ఏయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సమావేశాన్ని ఏర్పాటుచేసి అనుమతి తీసుకున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలు సమయంలో మాజీ వీసీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్‌ బసవయ్య, ప్రొఫెసర్‌ కుంజం నాగేశ్వరరావు, అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ మేకా స్టీఫెన్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణ అప్పారావును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసాదరెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలోనే ఉన్నారు. మరోవైపు ప్రసాదరెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులు యూనివర్సిటీకి చేరుకున్నారు. ఇదిలావుండగా వీసీ ప్రసాదరెడ్డిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆరేటి మహేష్‌, ఏయూ మాజీ ప్రొఫెసర్‌ జాన్‌, మరికొందరు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడే పెద్దఎత్తున నినాదాలు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒక మాజీ వీసీని సస్పెండ్‌ చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

Updated Date - Aug 01 , 2026 | 01:06 AM