శతాబ్ది వేడుకలకు సీనియర్లు దూరం
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:40 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు కొందరు సీనియర్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ దూరంగా ఉన్నారు.
సెంటినరీ సెలబ్రేషన్స్‌కు హాజరుకాని ప్రొఫెసర్లు
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు కొందరు సీనియర్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ దూరంగా ఉన్నారు. ఈ ఏడాది 26 నాటికి ఏయూ ఏర్పాటై వందేళ్లు పూర్తి కావ స్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 26 వరకు పూర్తిస్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలను వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్లకు ఉన్నతాధికారులు అప్పగించారు. అయితే, ఆయా కార్యక్రమాల్లో వర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది, విద్యార్థులంతా భాగం కావా. కానీ, కొందరు సీనియర్ ప్రొఫెసర్లు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆయా కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చూస్తున్న కొందరు ప్రొఫెసర్లు, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు మాత్రమే పాల్గొంటున్నారు. కానీ సీనియర్లు ఎంతో మంది హాజరుకావడం లేదు. దీనికి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, సదరు ప్రొఫెసర్ల మధ్య దూరం పెరగడమే కారణంగా చెబుతున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ, వాక్‌థాన్, తాజాగా నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్, విదేశీ విద్యార్థులతో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్, కల్చరల్ పెస్టివల్‌కు చాలామంది సీనియర్ ప్రొఫెసర్లు దూరంగా ఉండిపోయారు.
కలిసికట్టుగా చేయాల్సిన చోట..
వందేళ్ల వేడుకలు అంటే సాధారణ విషయం కాదు. దేశంలో అతికొద్ది విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. ఈ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో వర్సిటీలో పనిచేసే వారంతా భాగస్వాములు కావాల్సి ఉంది. అయితే ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్లు దూరంగా ఉండడం వల్ల ఆశించినస్థాయిలో జోష్ కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇబ్బందులు ఉంటే తరువాత చూసుకోవాలి గానీ.. కీలకమైన సమయంలో సరికాదని పలువురు పేర్కొంటున్నారు. అదే సమయంలో వీసీ కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలంటున్నారు. వారం రోజుల్లో వేడుకలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ ప్రొఫెసర్లు, గతంలో కీలక స్థానాల్లోపనిచేసిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం, వారిని భాగస్వాములను చేస్తూ బాధ్యతలను అప్పగించడం ద్వారా జోష్ నింపేందుకు అవకాశం ఉందని సూచిస్తున్నారు.