Share News

వైసీపీకి అనుకూలంగా సీనియర్‌ అసిస్టెంట్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:53 PM

మండలంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న మండల పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు జిల్లా ఎన్నికల పరిశీలకులకు గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటరమణను విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

వైసీపీకి అనుకూలంగా సీనియర్‌ అసిస్టెంట్‌

జిల్లా ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు

విచారణకు ఆదేశించి జడ్పీ సీఈవో

విధుల నుంచి తప్పించాలని టీడీపీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి విజ్ఞప్తి

చింతపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామారావు గతంలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తున్నాడని ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలకు ఉపక్రమించారు. స్థానిక వైసీపీ నేత, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సుభద్ర సహకారంతో తిరిగి చింతపల్లి మండల పరిషత్‌ కార్యాలయంల విధుల్లో చేరాడు. నాడు వైసీపీ నాయకులు చేసిన సహకారానికి కృతజ్ఞతగా మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ వైసీపీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పీవో, ఏపీవో, ఓపీవోల వివరాల జాబితాను వైసీపీ నాయకులకు చేరవేస్తూ పరోక్షంగా ఉద్యోగులు వైసీపీకి ఓటు వేయాలని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తున్నది. అన్నదాత సుఖీభవ, తల్లికివందనం లబ్ధిదారుల జాబితా, ఫోన్‌ నంబర్లను సైతం సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో వివిధ శాఖల అధికారుల నుంచి సేకరించి వైసీపీ నాయకులకు చేరవేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో జిల్లా ఎన్నికల పరిశీలకులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అందజేసిన విచారణ నివేదిక ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్పందించి వైసీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ని తక్షణమే విధుల నుంచి తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 31 , 2026 | 10:53 PM