విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:31 AM
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో విశాఖ సమీపంలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు.
- హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో నిర్మాణానికి చర్యలు
- మూడేళ్లలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ
విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో విశాఖ సమీపంలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. హడ్‌కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో నోవాటెల్ హోటల్‌లో ఆదివారం ప్రారంభమైన అర్బన్ ఇన్వెస్ట్‌మెంట్ విండో వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ పరిశీలిస్తోందన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించిన ఒక రహదారి నిర్మాణానికి అటవీశాఖ భూమి అడ్డంకిగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో చర్చించి సమస్యను పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వం సెంటు స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నందున విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. విచారణ వల్ల ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, రెండు నెలల్లో సాంకేతికపరమైన అంశాలు కొలిక్కివస్తే వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వలన రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్.కటికితాల మాట్లాడుతూ పట్టణాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులను సమీకరించడంపై కేంద్రం దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే అర్బన్ ఇన్వెస్ట్‌మెంట్ విండోను గత ఏడాది నవంబరులో ప్రారంభించిందన్నారు. పెట్టుబడుల సమీకరణకు సంప్రదాయ పద్ధతులతో పాటు క్యాపిటల్ మార్కెట్లు, మునిసిపల్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్టులు వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సేవలను వినియోగించుకునే అవకాశాలపై వర్క్‌షాప్‌లో ప్రతినిధులు చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, హడ్కో డైరెక్టర్ (కార్పొరేట్ ప్లానింగ్) ఎం.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.