మూడు జిల్లాలను కలుపుతూ సెమీ రింగ్‌రోడ్డు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:52 AM
అనకాపల్లి-విశాఖపట్నం-విజయనగరం జిల్లాలను కలుపుతూ సెమీ రింగురోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నామని వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు.
రాంబిల్లి నుంచి భోగాపురం వరకూ 120 అడుగుల వెడల్పుతో నిర్మాణం
ఈ నెలాఖరు నాటికి డీపీఆర్ సిద్ధం
వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్
సిరిపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి-విశాఖపట్నం-విజయనగరం జిల్లాలను కలుపుతూ సెమీ రింగురోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నామని వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు. సంబంధిత విభాగాల అధికారులతో మంగళవారం వీఎంఆర్డీఏలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి విశాఖపట్నం మీదుగా విజయనగరం జిల్లా భోగాపురం వరకు సెమీ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్), తుది అలైన్‌మెంట్ ప్లాన్ ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వానికి సమర్పించేలా సిద్ధం చేయాలని సంబంధిత కన్సల్టెన్సీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 120 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించనున్నందున ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మైనర్, మేజర్ వంతెనలు అవసరమో గుర్తించాలన్నారు. అభివృద్ధి చేయాల్సిన భూముల వివరాలను పూర్తి స్థాయి ప్లాన్‌లో పొందుపరచాలన్నారు. రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నందున, అందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో ఓఎస్డీ కృష్ణానాయక్, ప్రధాన ఇంజనీర్ వినయ్‌కుమార్, ఇంజనీర్లు మధుసూదనరావు, దుర్గాప్రసాద్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.