Share News

తర్లువాడలో సెమీకండక్టర్‌ యూనిట్‌

ABN , Publish Date - May 20 , 2026 | 12:30 AM

విశాఖపట్నం జిల్లాలో సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకానుంది.

తర్లువాడలో సెమీకండక్టర్‌ యూనిట్‌

రూ.2,387.81 కోట్ల పెట్టుబడి

వేయి మందికి ఉద్యోగాలు

ఎకరా రూపాయి చొప్పున 30 ఎకరాలు కేటాయింపు

సేల్‌ అగ్రిమెంట్‌ స్థానంలో సేల్‌ డీడ్‌కు ఆమోదం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాలో సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకానుంది. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు కేటాయించిన భూములు పక్కనే ఈ సంస్థకు 30 ఎకరాలు కేటాయించారు. అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ (ఏఎస్‌ఐపీ) ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో వ్యవహరిస్తున్న ఈ సంస్థ రెండు దశల్లో రూ.2,387.81 కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తొలి దశలో రూ.542.19 కోట్లు వెచ్చించి 200 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. రెండో దశలో రూ.1,845.61 కోట్లు పెట్టి యూనిట్‌ను పూర్తి చేసి మిగిలిన 800 మందికి ఉపాధి కల్పిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇందుకోసం అవుట్‌ సోర్స్‌డ్‌ సెమీ కండక్టర్‌ అసెంబిల్‌ అండ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ (ఓఎస్‌ఏటీ) ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ పథకం కింద సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, మార్కింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ యూనిట్‌ పెట్టడానికి హైదరాబాద్‌కు చెందిన ఏఎస్‌ఐపీ ముందుకువచ్చింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూపాయి చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. వీరికి ఏపీఐఐసీ ద్వారా సేల్‌ అగ్రిమెంట్‌ చేయాల్సి ఉండగా, సంస్థ సేల్‌ డీడ్‌ (పూర్తి హక్కులు) చేయాలని కోరగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సూచనతో రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. తర్లువాడలో సర్వే నంబరు 1/పిలో 27.83 ఎకరాలు, పక్కనే ఆనుకొని ఉన్న గిడిజాల గ్రామంలో 378/పిలో 2.169 ఎకరాలు కేటాయించారు.

Updated Date - May 20 , 2026 | 12:30 AM