సొంతంగా సుందరీకరణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:49 AM
న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) మాదిరిగా నగరంలో బ్యూటిఫికేషన్, గ్రీనరీ నిర్వహణ పనులను జీవీఎంసీకే స్వయంగా చేపట్టేలా కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రణాళికలు తయారుచేస్తున్నారు.
పచ్చదనం నిర్వహణ కూడా...
ఢిల్లీలో మాదిరిగా జీవీఎంసీయే చూసుకునేలా ప్రణాళిక
కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయం
అధ్యయనానికి వివిధ విభాగాలకు చెందిన ఎనిమిది మంది అధికారులు పయనం
‘హార్టికల్చర్’లో కాంట్రాక్టర్లకు స్వస్తి
ముడసర్లోవలో సొంతంగా నర్సరీ ఏర్పాటు
కాంట్రాక్టు, రోజువారీ కూలీలతో పనులు
వచ్చే ఏప్రిల్ నుంచి కొత్తవిధానం అమలుచేయాలని లక్ష్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) మాదిరిగా నగరంలో బ్యూటిఫికేషన్, గ్రీనరీ నిర్వహణ పనులను జీవీఎంసీకే స్వయంగా చేపట్టేలా కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పచ్చదనం పెంపు, మొక్కల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్టు ఆయన భావిస్తున్నారు. కొన్నిసార్లు పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు అధికారులు బిల్లులు సిఫారసు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బ్యూటిఫికేషన్‌ను జీవీఎంసీయే చూసుకునేలా హార్టికల్చర్ విభాగాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు.
జీవీఎంసీ సుమారు 691 చదరపు కిలోమీటర్లు వైశాల్యంలో విస్తరించి ఉంది. సంస్థ పరిధిలో గల పార్కులు, గ్రీన్‌బెల్ట్, ప్రధాన రహదారుల మధ్య ఉండే సెంటర్ మీడియన్లు, రోడ్ల మార్జిన్‌లు, బీచ్‌రోడ్డు పొడవునా ఉన్న మొక్కలు, చెట్లతోపాటు లాన్‌లు, ప్రధాన కూడళ్లలోని ఐలాండ్‌లు, విగ్రహాల వద్ద ఉండే పచ్చదనం నిర్వహణ బాధ్యతను హార్టికల్చర్ విభాగం పర్యవేక్షిస్తుంది. పచ్చదనం, బ్యూటిఫికేషన్ నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. మొక్కల సంరక్షణ బాధ్యతను ప్యాకేజీలుగా విభజించి టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. అయితే హార్టికల్చర్ విభాగంలోని అఽధికారులు, సిబ్బంది కక్కుర్తిని ఆసరాగా తీసుకుని కొందరు కాంట్రాక్టర్లు పనులు సరిగా చేయడం లేదు. దీంతో మొక్కలు చనిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్తమొక్కలు వేయాల్సి ఉన్నప్పటికీ ఏదో సాంకేతిక కారణం చెప్పి కాంట్రాక్టర్లు తప్పించుకుంటున్నారు. ప్రతి 500 చదరపు అడుగులకు ఒక కూలీని నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ ఒకరిద్దరితోనే తమ ప్యాకేజీలో పనులన్నీ చేయిస్తున్నారు. దీనివల్ల సెంటర్ మీడియన్ల మధ్యలోని మొక్కల కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. ఇది వాహనచోదకులకు ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులో కోత విధించాల్సిన అధికారులు...అందుకు భిన్నంగా పనులను పక్కాగా చేసినట్టు రికార్డుల్లో పేర్కొంటూ బిల్లులకు సిఫారసు చేస్తున్నారు.
జీవీఎంసీయే స్వయంగా బ్యూటిఫికేషన్ నిర్వహణ
డబ్బులు ఖర్చు అవుతున్నా నగరంలో సుందరీకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదని భావించిన కమిషనర్ కేతన్‌గార్గ్ ఇకపై జీవీఎంసీయే బ్యూటిఫికేషన్ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఇకపై అరుదైన, అందమైన మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేయకుండా ముడసర్లోవలోని జీవీఎంసీకి చెందిన ఏడెకరాల స్థలంలో సొంతంగా నర్సరీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) ఆధ్వర్యంలో ఆంధ్రా భవన్ ప్రాంతంలో బ్యూటిఫికేషన్ చక్కగా జరుగుతున్నట్టు గుర్తించడంతో అదేమాదిరిగా జీవీఎంసీ కూడా స్వయంగా కూలీలతో పనులు చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు. దీనికోసం ఇంజనీరింగ్, హార్టికల్చర్, పీ అండ్ ఎల్‌సీ విభాగాలకు చెందిన ఎనిమిది మంది అధికారులను నాలుగు బృందాలుగా విభజించి ఢిల్లీలో అధ్యయనం కోసం పంపించారు. అక్కడి నుంచి అధికారులు వచ్చిన తర్వాత తమ అధ్యయన నివేదిక అందజేయగానే దానికి అనుగుణంగా మిగిలిన ప్రక్రియల కోసం జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించాలని కమిషనర్ యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే జీవీఎంసీ స్వయంగా నగరంలో మొక్కల పెంపకం, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టేలా ప్రణాళికలను సిద్ధంచేస్తున్నారు.
రూ.ఎనిమిది కోట్లు వరకు ఖర్చు.. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
మొక్కలను పెంచే నర్సరీ ఏర్పాటుకు మొదట్లో జీవీఎంసీకి రూ.ఎనిమిది కోట్లు వరకు ఖర్చయినా తర్వాత నుంచి ఏటేటా ఖర్చు గణనీయంగా తగ్గి, నిధులు ఆదా అవుతాయి. గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలోని ఏపీ గ్రీన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నర్సరీని తొలగించబోతుండడంతో, అక్కడున్న రెండు లక్షల మొక్కలను ఉచితంగా ఇచ్చేలా సంబంధిత అధికారులను ఒప్పించాం. దీనివల్ల జీవీఎంసీకి భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడున్న ప్రజారోగ్య విభాగంలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రతకు కాంట్రాక్ట్, రోజువారీ కూలీలను వాడుకుంటున్నట్టే హార్టికల్చర్ విభాగానికి కూడా పనిచేసే వారిని తీసుకుంటాం. హార్టికల్చర్ విభాగంలో ప్రతి జోన్‌కు ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉండడంతో వారి జోన్‌లో పచ్చదనం నిర్వహణకు వారినే బాధ్యులను చేస్తాం. ఉద్యోగులు కాబట్టి పక్కాగా పనులు చేపడతారు. దాంతో కాంట్రాక్టర్లతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అయిపోతాయి.