Share News

కలెక్షన్‌ కింగ్‌లుగా కార్యదర్శులు!

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:04 AM

జీవీఎంసీ పరిధిలోని కొన్ని వార్డు సచివాలయాలు అవినీతికి నిలయంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కలెక్షన్‌ కింగ్‌లుగా కార్యదర్శులు!

  • అవినీతికి కేరాఫ్‌గా కొన్ని వార్డు సచివాలయాలు

  • భవన నిర్మాణదారులను బెదిరించి ప్లానింగ్‌ సెక్రటరీల వసూళ్లు

  • ఇంటి పన్ను విధింపు కోసం అడ్మిన్‌ సెక్రటరీలు...

  • అక్రమార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్న కొందరు ఉద్యోగులు

  • ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

(విశాఖపట్నం/గాజువాక -ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ పరిధిలోని కొన్ని వార్డు సచివాలయాలు అవినీతికి నిలయంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది కార్యదర్శులు అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్‌ చేసి, ఆ మేరకు ఇవ్వకపోతే రోజుల తరబడి తమ చుట్టూ తిప్పుంచుకుంటున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. జీవీఎంసీ 74వ వార్డు పరిధిలోని నెహ్రూనగర్‌ సచివాలయం అడ్మిన్‌ సెక్రటరీ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో సచివాలయ సిబ్బంది పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది.

జీవీఎంసీ పరిధిలో 576 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో వార్డు అడ్మిన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరీ సెక్రటరీ, ఎమినిటీస్‌ సెక్రటరీ, మహిళా పోలీస్‌, డిజిటల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు హెల్త్‌ సెక్రటరీ...ఇలా ఎనిమిది మంది పనిచేస్తున్నారు. వీరందరికీ అడ్మిన్‌ సెక్రటరీ టీమ్‌ లీడర్‌గా వ్యవహరిస్తూ వార్డు పరిధిలో ఆస్తి పన్ను విధింపు, టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌, యూసేజ్‌ ఛేంజింగ్‌, ట్యాక్స్‌ ఎన్‌హేన్స్‌మెంట్‌ వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరీ సెక్రటరీ తమ వార్డు పరిధిలో భవన నిర్మాణాలు ప్లాన్‌కు అనుగుణంగా జరిగేలా చూడడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మిగిలినవారు కూడా తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే మిగిలిన కార్యదర్శులతో పోల్చితే అవినీతికి పాల్పడేందుకు వార్డు అడ్మిన్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ సెక్రటరీలకు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు ప్లానింగ్‌, అడ్మిన్‌ సెక్రటరీలు చెలరేగిపోతున్నారు. వార్డులో ఎక్కడ భవన నిర్మాణం జరిగినా సరే ప్లానింగ్‌ సెక్రటరీలు అక్కడకు చేరి అనుమతులను పరిశీలించి, ఏదో ఒకసాకు చూపి నిర్మాణదారులను బెదిరిస్తున్నారు. భవన నిర్మాణంలో పక్కాగా నిబంధనలను పాటించే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఎంతోకొంత ఉల్లంఘన ఉంటుంది. దానిని అడ్డంపెట్టుకుని ఉన్నతాధికారుల నుంచి తమకు ఒత్తిడి ఉందంటూ డబ్బులు గుంజేస్తున్నారు. అదే ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినా, అదనపు అంతస్థులు నిర్మించినా రూ.లక్షల్లో గుంజేస్తున్నారు. అడ్మిన్‌ సెక్రటరీల తీరు కూడా అదేరీతిన ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకుంటే దానికి ఆస్తి పన్ను విధించాలన్నా, ఒకరి నుంచి ఇల్లు కొనుగోలు చేస్తే ఆ పన్నును తమ పేరిట మార్చుకోవాలన్నాసరే వార్డు అడ్మిన్‌ సెక్రటరీ నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వార్డు అడ్మిన్‌ సెక్రటరీ ఆయా దరఖాస్తులను తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే తర్వాత దశలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు, రెవెన్యూ అధికారికి...అక్కడి నుంచి జోనల్‌ కమిషనర్‌కు వెళ్లి ఆమోదం పొందుతుంది. ఒకవేళ అడ్మిన్‌ సెక్రటరీ ఎక్కువ పన్ను ప్రతిపాదించినా, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యమైనా సరే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల నుంచి అడ్మిన్‌ సెక్రటరీలు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే వార్డు పరిధిలో నివాసయోగ్యమైన భవనాల్లో కొందరు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుంటారు. అలాంటి వాటిని అడ్మిన్‌ సెక్రటరీలు గుర్తించి రెసిడెన్షియల్‌ నుంచి కమర్షియల్‌ కేటగిరీలోకి మార్పించి ఆ మేరకు పన్ను విధించాల్సి ఉంటుంది. అయితే అలాంటి భవనాలు కనిపిస్తే వాటి వద్దకు వెళ్లి పన్ను పెంచాల్సి ఉంటుందని బెదిరించి భవన యజమానుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు.

గత ఏడాది గాజువాక జోన్‌ పరిధిలోని ప్రశాంతినగర్‌ వార్డు సెక్రటరీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా, సోమవారం 74వ వార్డు సచివాలయం అడ్మిన్‌ సెక్రటరీ పన్ను టైటిల్‌ను యజమాని పేరు నుంచి తన భార్య పేరిట మార్చడానికి రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సచివాలయాలపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తారో, లేదో చూడాలి.

Updated Date - Feb 04 , 2026 | 01:04 AM