Share News

వైసీపీ వాసనలు పోని సచివాలయాలు

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:00 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా, వార్డు సచివాలయాల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, తమకు జగన్‌మోహన్‌రెడ్డే నాయకుడు అన్నట్టు పలువురు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆరోపించారు.

వైసీపీ వాసనలు పోని సచివాలయాలు

జగనే తమ నాయకుడు అన్నట్టు కొందరు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారు

ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మంత్రి, ఎంపీలకు నాయకుల ఫిర్యాదు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్న శ్రీబాలవీరాంజనేయస్వామి

నాయకులను, కార్యకర్తలను హింసించిన సీఐ కోరాడ రామారావుకు కీలక పోస్టింగ్‌ ఎలా ఇస్తారంటూ అసంతృప్తి

పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించాలని కార్యకర్తల విజ్ఞప్తి

సిరిపురం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా, వార్డు సచివాలయాల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, తమకు జగన్‌మోహన్‌రెడ్డే నాయకుడు అన్నట్టు పలువురు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆరోపించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఎంపీ ఎం.భరత్‌, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ నేతృత్వంలో ఉత్తర నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. వార్డు కార్యాలయాల్లో చాలామంది సిబ్బంది ఇంకా వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని, కూటమి నాయకుల మాటను ఏమాత్రం లెక్క చేయడం లేదని సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ పెద్దల ముందు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో తమ వార్డుల పరిధిలో సచివాలయాలకు సంబంధించిన పనులు ఏమీ చేయలేక, ప్రజలకు దూరమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. దీనిపై ఇన్‌చార్జి మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే అక్కడి సిబ్బంది అంతా పనిచేయాలని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులొస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులను, కార్యకర్తలను నానా రకాలుగా హింసించి, వేధించి, ఇబ్బందులు పాల్జేసిన అప్పటి త్రీటౌన్‌ సీఐ కోరాడ రామారావును తాజాగా కంచరపాలెం లాంటి కీలక స్టేషన్‌కు సీఐగా నియమించడం ఎంతవరకూ సమంజసమని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై ఏడు కేసులు నమోదు చేశారని పార్టీ ఉపాధ్యక్షుడు కోట నరేష్‌ తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ, ఆ విషయం తన నోటీస్‌కు వచ్చిందని, త్వరలోనే తగిన నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డులో పార్టీకి ఏమాత్రం సంబంధం లేని మహిళకు అవకాశం ఇచ్చారని, ఇలాంటి చర్యలు పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండాలు పట్టుకొని తిరుగుతున్న వారిని తీవ్ర అవమానానికి గురిచేస్తున్నాయన్నారు. ఎవరి పేరో చెప్పుకుని వచ్చిన వారికి కీలక పదవులు ఎలా ఇస్తారని మరికొందరు నాయకులు ప్రశ్నించారు. ఉత్తర నియోజకవర్గానికి ప్రస్తుతం ఎంపీ భరత్‌ ఇన్‌చార్జిగా ఉన్నారని, ఆయన బాగానే స్పందిస్తున్నప్పటికీ పార్టీ అభివృద్ధి దృష్ట్యా తక్షణమే పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించాలని అత్యధికులు కోరారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: ఇన్‌చార్జి మంత్రి డోలా

స్థానిక సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపి తీరుతామని, వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు అంతా సిద్ధంగా ఉండాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సూచించారు. కూటమిలోని మిగతా పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలన్నారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు మరింత చేరువయ్యేలా త్వరలో ప్రతి జోన్‌లో పార్టీపరంగా కార్యాలయాలను ఏర్పాటుచేయనున్నట్టు జోనల్‌ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. పనిచేసే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, అలాంటి వారికి అండగా నిలుస్తామన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దువ్వారపు రామారావు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్‌, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, మహ్మద్‌ నజీర్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి మల్లిక్‌నాయుడు, నాయకులు ఈతలపాక సుజాత, కోట నరేష్‌, కంప హనోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 01:00 AM