Share News

ఏసీబీ వలలో సచివాలయ కార్యదర్శి

ABN , Publish Date - Mar 24 , 2026 | 01:01 AM

తల్లిపేరిట ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీదకు మార్చేందుకు రూ.80 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో సచివాలయ కార్యదర్శి

తల్లిపేరిట ఉన్న ఆస్తిని కొడుకు పేరుపైకి మార్చేందుకు రూ.90 వేలు డిమాండ్‌

రూ.80 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం

విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

తల్లిపేరిట ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీదకు మార్చేందుకు రూ.80 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ పరిధి అక్కయ్యపాలెం లలితా నగర్‌లోని లలితాదేవి ఆలయం రోడ్డులో గల వార్డు సచివాలయం (నంబర్‌ 125)లో పైలా రాజేష్‌ ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. లలితానగర్‌లో నివాసం ఉంటున్న ద్వారపురెడ్డి గంగరాజ్యానికి దాదాపు 526.26 గజాల స్థలంతోపాటు అందులో ఇల్లు ఉంది. గంగరాజ్యం ఆ స్థలంతోపాటు ఇంటిని తన కుమారుడైన వరహా త్రినాథగణేష్‌కు ఇస్తూ గత ఏడాది డిసెంబరులో సెటిల్‌మెంట్‌ డీడ్‌ రాసి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ కూడా చేయించారు. ఆ ఆస్తికి సంబంధించి పన్నుతోపాటు, కొళాయి కనెక్షన్‌ వంటివన్నీ తన తల్లి పేరు నుంచి తన పేరు మీదకు మునిసిపల్‌ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయాలని కోరుతూ వరహ త్రినాథ్‌గణేష్‌ తన కుమారుడైన అక్షయగణేష్‌ను తీసుకుని గత నెల పదో తేదీన లలితా నగర్‌లోని వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అదేరోజు ఆ దరఖాస్తును పరిశీలించిన వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ రాజేష్‌ సదరు ఆస్తికి సంబంఽధించిన డాక్యుమెంట్‌లను పరిశీలించి చలాన్‌ కింద రూ.45 వేలు చెల్లించాలని సూచించారు. అక్షయగణేష్‌ ఆమొత్తానికి చలాన్‌ తీసి వార్డు కార్యదర్శి రాజేష్‌ను కలవగా మ్యుటేషన్‌ దరఖాస్తుని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలంటే తనకు రూ.90 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడగా, రూ.80 వేలు ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయనని రాజేష్‌ స్పష్టంచేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని అక్షయగణేష్‌ ఏసీబీ అధికారులకు కలిసి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వార్డు సచివాలయం వద్ద మాటువేసి గణేష్‌ నుంచి రాజేష్‌ రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినా టోల్‌ఫ్రీనంబర్‌ 1064 లేదా9440440057 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.


ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ స్వాధీనం?

జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే యోచన

విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకోవాలని జీవీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు ఈ కాంప్లెక్స్‌ జీవీఎంసీ ఆధీనంలోనే ఉండేది. అందులోని మూడు స్విమ్మింగ్‌పూల్స్‌లో శిక్షణ పొంది పలువురు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్ఙాయి పోటీల్లో సత్తాచాటారు. మరికొందరు వ్యాయామంలో స్విమ్మింగ్‌ సాధన చేసేవారు. అయితే మరమ్మతులకు గురవడంతో కరోనా సమయంలో పూర్తిగా మూసివేశారు. ఆ తరువాత రూ.ఐదు కోట్లకు పైగా వెచ్చించి ఆధునికీకరించారు. అనంతరం నిర్వహణను అప్పటి కమిషనర్‌ ప్రైవేటు ఏజెన్సీకి మూడేళ్లు లీజుకు ఇచ్చేశారు. ఆ ఏజెన్సీ ఒప్పందం ప్రకారం సిబ్బందిని నియమించకపోవడంతోపాటు అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో నగరవాసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కాంప్లెక్స్‌ లీజు గడువు వచ్చే జూన్‌తో ముగియనుంది. ఇదిలావుండగా స్వర్ణభారతి స్టేడియం నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నగరవాసుల అభిప్రాయానికి అనుగుణంగా జీవీఎంసీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. దీనివల్ల నెలరోజుల్లోనే సుమారు రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను కూడా జీవీఎంసీయే నిర్వహిస్తే అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు జీవీఎంసీకి అధిక ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లీజు గడువు పొడిగించకుండా, స్వాధీనం చేసుకుని నిర్వహించేలా జీవీఎంసీ ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు ప్రతిపాదన పంపినట్టు తెలిసింది.

Updated Date - Mar 24 , 2026 | 01:01 AM