విధులకు సచివాలయ ఉద్యోగుల డుమ్మా
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:14 AM
మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఉద్యోగులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మూడు గంటల పాటు నిరీక్షించి నిరాశతో వెనుదిరిగిన ఆదివాసీలు
గూడెంకొత్తవీధి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఉద్యోగులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్క ఉద్యోగి కూడా సచివాలయంలో అందుబాటులో లేరు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి గ్రామ సచివాలయానికి వచ్చిన ఆదివాసీలు ఉద్యోగుల కోసం గంటల తరబడి నిరీక్షించి తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జీకేవీధి పంచాయతీ గ్రామ సచివాలయం ఉద్యోగులు కొంత కాలంగా విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగులు ఏ సమయంలో కార్యాలయానికి వస్తారో?, ఎప్పుడు వెళ్లిపోతారో తెలియడం లేదు. గ్రామ సచివాలయాలను పర్యవేక్షించేందుకు మండలానికి ఒక డిప్యూటీ ఎంపీడీవోని నియమించినప్పటికి సచివాలయం వ్యవస్థలో ఎటువంటి మార్పురాలేదు. ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్నారు. అలాగే భూ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించి అర్జీలు పెట్టుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ఆదివాసీలు వస్తున్నారు. డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా కానిస్టేబుల్, వీఆర్వో, అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సచివాలయం ఉద్యోగులు విధులకు గైర్హాజరు కావడంపై ఇప్పటికే ఆదివాసీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమైన ఎంపీడీవో రమణబాబు వివరణ కోరగా, విచారణ చేపట్టి ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.