డీఎస్సీ ఖాళీలపై గోప్యత
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:49 AM
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.
మార్చి ఒకటో తేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్
కొన్ని పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీలు పెద్దగా ఉండకపోవచ్చునంటున్న ఉపాధ్యాయ వర్గాలు
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ప్రాథమికంగా సేకరించారు. దీని ప్రకారం తక్కువ ఖాళీలు ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా విద్యాశాఖ మాత్రం ఖాళీలపై ఇంతవరకు స్పష్టత ఇవ్వడంలేదు. ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్, వ్యాయాయ ఉపాధ్యాయ ఖాళీల వివరాలు చెప్పడంలేదు.
జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 200 నుంచి 250 వరకు ఖాళీలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ సంఘాలే అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు స్కూలు అసిస్టెంట్ కేటగిరీలో మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలల్లో నియమించారు. తెలుగు, ఆంగ్లంలో ఎక్కువగా మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటనతో జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆరో తరగతికి వెళితే అదే స్థాయిలో ఒకటోతరగతిలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ టీచర్ పోస్టు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మార్చి ఒకటో తేదీన ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులు చాలావరకు రద్దు కావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో కొత్త టీచర్ల నియామకంపై భారీ ఆశలు పెట్టుకోవద్దని టీచర్లు అంటున్నారు. మార్చి ఒకటో తేదీన ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని రేషనలైజేషన్ అమలు చేసినా జూన్‌లో ప్రవేశాలు ఆశాజనకంగా లేకపోతే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. టీచర్ల సర్దుబాటుతో చాలా పోస్టులు మిగులు ఉంటాయంటున్నారు.