రాజ్‌మా రాయితీ విత్తనాలపై రెండో దశ పరీక్షలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:34 PM
ఆదివాసీ రైతులకు రాయితీపై పంపిణీ చేయనున్న రాజ్‌మా విత్తనాలకు రెండో దశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) బీవీ తిరుమలరావు తెలిపారు.
నమూనాలు ఆర్‌ఏఆర్‌ఎస్‌కి తరలింపు
ఏడీఏ బీవీ తిరుమలరావు
చింతపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులకు రాయితీపై పంపిణీ చేయనున్న రాజ్‌మా విత్తనాలకు రెండో దశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) బీవీ తిరుమలరావు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు రబీ పంటగా రైతులు రాజ్‌మా పంటను సాగు చేస్తున్నారన్నారు. రైతులకు 90 శాతం రాయితీపై ప్రభుత్వం విత్తనాలను అందజేస్తుందన్నారు. ఈ ఏడాది ముందుగానే రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు పంపించామని చెప్పారు. విత్తనాల నాణ్యతపై వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల పరిధిలో మొలకశాతంపై తొలిదశ పరీక్షలు నిర్వహించారన్నారు. తాజాగా రెండో దశ పరీక్షలు నిర్వహించేందుకు విత్తన నమూనాలను స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి పంపించామని చెప్పారు. ఐదు రోజుల్లో విత్తనాల నాణ్యతపై శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తారన్నారు. శాస్త్రవేత్తల పరీక్షల్లో మొలకశాతం ఆశాజనకంగా ఉంటే విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. మొలకశాతం తగ్గితే విత్తనాలను తిరిగి వెనక్కి పంపిస్తామని చెప్పారు. ఏపీ సీడ్స్ అధికారులు గిరిజన ప్రాంతానికి అనువైన చింతపల్లి రెడ్ విత్తనాలు సరఫరా చేశారన్నారు. ఈ విత్తనాలు నెలాఖరు నుంచి డీ కృషి యాప్ ద్వారా పారదర్శకంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి టి.మధుసూదనరావు పాల్గొన్నారు.