Share News

నేడే రెండో దశ పల్లె పోరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:56 AM

జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల్లోని 179 పంచాయతీలు, 1,566 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరగనుండగా, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

నేడే రెండో దశ పల్లె పోరు
ఎస్‌.రాయవరంలో ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది

- 8 మండలాల్లో 179 సర్పంచ్‌ పదవులకు,

1,566 వార్డులకు ఎన్నికలు

- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

- మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు

అనకాపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల్లోని 179 పంచాయతీలు, 1,566 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరగనుండగా, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఎనిమిది మండలాల పరిధిలోని 213 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా...కోటవురట్ల మండలంలో 4, నక్కపల్లిలో 4, పాయకరావుపేట 3, ఎస్‌.రాయవరం 5, అచ్యుతాపురం 2, మునగపాక 8, రాంబిల్లి 4, ఎలమంచిలి 3 పంచాయతీలు కలిపి మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మరో పంచాయతీకి నామినేషన్ల దాఖలు కాలేదు. దీంతో ఆదివారం 179 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 451 మంది పోటీ పడుతున్నారు. అలాగే 2,072 వార్డుల్లో 506 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 1,566 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 3,355 మంది పోటీ పడుతున్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 599 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను, 552 సమస్యాత్మక, 941 సాధారణ పోలింగ్‌ స్టేషన్లను గుర్తించి, వాటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 38 జోన్లు, 44 జోనల్‌ అధికారులు, 67 రూట్లు, 77 రూట్‌ అధికారులను నియమించారు.

ఎన్నికల విధుల్లో 6,111 మంది సిబ్బంది

ఎన్నికల నిర్వహణకు 6,111 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. అవసరమైన పెద్ద బ్యాలెట్‌ బాక్సులు 876, చిన్నవి 1,019 మొత్తం 1,895 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశారు. పెద్ద, చిన్న కలిపి మరో 1,798 రిజర్వులో ఉంచారు. ఎన్నికల సామగ్రి, పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను శనివారం సాయంత్రానికే పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.

పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు

పోలింగ్‌ ముగిసిన వెంటనే 8 మండల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఐదు వేల మందికి పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించారు.

Updated Date - Nov 29 , 2026 | 12:56 AM