Share News

అనకాపల్లి నుంచి మరో రెండో కొత్త రైళ్లు

ABN , Publish Date - May 04 , 2026 | 12:53 AM

అనకాపల్లి నుంచి తిరుపతి, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వారం రోజుల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వస్తామని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అయిన సీఎం రమేశ్‌ ప్రకటించారు. అనకాపల్లి నుంచి తెలంగాణలోని చర్లపల్లి (సికింద్రాబాద్‌ శివారు) మధ్య ప్రవేశపెట్టిన వారాంతపు ప్రత్యేక రైలును (నంబరు 17046) ఆయన ఆదివారం సాయంత్రం ఒకటో నంబరు ప్లాట్‌ఫారం నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

అనకాపల్లి నుంచి మరో రెండో కొత్త రైళ్లు
పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే కొణతాల, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, తదితరులు

తిరుపతి, షోలాపూర్‌లకు వీక్లీ ట్రైన్స్‌

8వ తేదీ అనకాపల్లి- తిరుపతి సర్వీసు ప్రారంభం

ఎంపీ సీఎం రమేశ్‌ వెల్లడి

అనకాపల్లి- చర్లపల్లి కొత్త వారంతపు రైలు సర్వీసు ప్రారంభం

అనకాపల్లి టౌన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నుంచి తిరుపతి, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వారం రోజుల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వస్తామని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అయిన సీఎం రమేశ్‌ ప్రకటించారు. అనకాపల్లి నుంచి తెలంగాణలోని చర్లపల్లి (సికింద్రాబాద్‌ శివారు) మధ్య ప్రవేశపెట్టిన వారాంతపు ప్రత్యేక రైలును (నంబరు 17046) ఆయన ఆదివారం సాయంత్రం ఒకటో నంబరు ప్లాట్‌ఫారం నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంపీ రమేశ్‌ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వందలాది మంది వెళుతుంటారని, రైల్వే స్టాండింగ్‌ బోర్డు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ నెల 8వ తేదీ నుంచి వీక్లీ సర్వీసును అందుబాటులోకి వచ్చేలా కృషి చేసినట్టు చెప్పారు. అనకాపల్లి జిల్లాలో కొత్తగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌తోపాటు కర్ణాటకలోని కలబుర్గి, మహారాష్ట్రలోని సోలాపూర్‌, చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకల సాగించే వారికోసం అనకాపల్లి-సోలాపూర్‌ వీక్లీ ప్రత్యేక రైలు కూడా వారి రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్‌ వంతెన పనులను త్వరలో పునరుద్ధరించేలా చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే, తదితరులు ప్లాట్‌ఫారంపై ఉన్న అనకాపల్లి-చర్లపల్లి రైలు బోగీల్లోకి వెళ్లి పలువురు ప్రయాణికులు మాట్లాడారు. హైదరాబాద్‌ వెళ్లిరావడానికి ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని పలువురు ప్రయాణికులు చెప్పారు. ఈ రైలులో సెకండ్‌ ఏసీ బోగీలు మూడు, థర్డ్‌ ఏసీ బోగీలు ఐదు, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు 10, మహిళలు, దివ్యాంగులకు రెండు బోగీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఆర్డీవో షేక్‌ ఆయీషా, స్టేషన్‌ మేనేజర్‌ సచ్చి నివాస్‌, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:53 AM